Mountaineer Rajitha In Kamareddy : అరకొర వసతులున్నా కృత నిశ్చయంతో లక్ష్యాలు సాధిస్తోంది ఈ యువతి. గిరిజన గ్రామంలో పుట్టినా మౌంటెనీర్‌గా రాణించాలని తపన పడింది. అనుకున్నట్టే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతం అధిరోహించింది. కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఇంటికి దూరంగా ఉంటూ పోటీ పరీక్షలకూ సన్నద్ధమైంది. కష్టాలు దాటి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగమూ సాధించి శభాశ్ అనిపించుకుంటోంది. ఈ యువతి పేరు మాలోత్ రజిత. ఈమెది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఎక్కపల్లి తండా. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినా చదువుల్లో ఎక్కడా తడబడలేదు. ఎల్లారెడ్డి కేజీబీజీవీలో 9వ తరగతి చదివే సమయంలో ఉపాధ్యాయులు ఓ కార్యక్రమానికి తీసుకు వెళ్లారు.
Maloth Rajitha Climbed Mount Kilimanjaro : అక్కడకు ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అతిథిగా హాజరై ప్రసంగించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయం రజితలో స్ఫూర్తి నింపాయి. తాను కూడా ఎప్పటికైనా పూర్ణలా పర్వతారోహణ చేయాలని అప్పుడే నిశ్చయించుకుంది. హైస్కూల్ పూర్తి అయినా లక్ష్యం చేరుకునే మార్గం కనిపించలేదు రజితకు. మెదక్‌లోని గీతా జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తయినా ఎలాంటి దారి దొరకలేదు. మెదక్‌లోనే సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడ చేరిన మొదటి ఏడాదిలోనే కళాశాల తరపున పర్వతారోహకురాలిగా వెళ్లేందుకు అవకాశం వచ్చింది. కానీ భయంతో వెనుకంజ వేసింది రజిత. 2వ ఏడాదిలో మళ్లీ అవకాశం తలుపు తట్టడంతో ఇక ఆగలేదు.
"తాను చిన్నప్పటి నుంచి ఎక్కాపల్లి తాండలోనే చదువుకున్నాను. 6వ తరగతి నుంచి కేజీబీజీవీలో చదువుకున్నాను. 9 వ తరగతి చదువుకునే సమయంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఎవరెస్ట్ అధిరోహిని మాలావత్ పూర్ణను అతిథిగా వచ్చారు. అప్పుడు తను పడిన కష్టాలను చెప్పినప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాను. పర్వతారోహకురాలిగా అవకాశం కోసం ఎదురు చూసి, రాగానే దానిని వినియోగించుకుని, కిలిమంజారోను అధిరోహించాను. ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను." - మాలోత్ రజిత, పర్వతారోహకురాలు.
ఎవరెస్ట్ ఎక్కిన 15 రోజుల్లోనే 'మకాలు' పర్వతం అధిరోహణ.. యువతి రికార్డ్!
కిలిమంజారో అధిరోహించిన మాలోత్ రజిత : రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 60 మందిని ఎంపిక చేయగా లద్ధాక్‌లో శిక్షణ అనంతరం కిలిమంజారో ఎక్కే అవకాశం ఇద్దరికే దక్కింది. ఆ ఇద్దరిలో రజిత కూడా ఒకరిగా నిలిచింది. కఠినమైన శిక్షణ, విపత్కర వాతావరణ పరిస్థితులు అధిగమించి కిలిమంజారోపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది రజిత. తర్వాత ఎవరెస్టు ఎక్కేందుకూ అర్హత సాధించింది. ఐతే లాక్‌డౌన్ రావడంతో తన కల కలగానే మిగిలిపోయింది. ఎవరెస్టు అధిరోహించే అవకాశం చేజారడంతో చదువుపై దృష్టి సారించింది రజిత. డిగ్రీ పూర్తయ్యాక ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ కళాశాలలో బీపెడ్‌లో చేరింది. తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంది. ఇటీవలే ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది.
మాలోత్ రజిత : కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని మాలోత్ రజిత అంటోంది. ఓ వైపు పర్వతారోహణ, మరోవైపు చదువును సమన్వయం చేసుకునేలా సోదరులు సాయం చేశారని చెబుతోంది. ఇవేకాక కబడ్డీ, అథ్లెటిక్స్ ఆటల్లోనూ సత్తా చాటింది రజిత. క్రాస్ కంట్రీ రన్నింగ్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచింది. ఆర్థికసమస్యలు వెంటాడినా, కనీస సౌకర్యాలు లేకపోయినా సంక్పలంతో లక్ష్యాలను సాధిస్తోంది రజిత. కరోనా వల్ల తన చిరకాల వాంఛ ఐన ఎవరెస్ట్ ఎక్కలేకపోయానని ఎవరైనా సహకరిస్తే ఎవరెస్ట్‌తో పాటు ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనేదే తన ఆకాంక్ష అని చెబుతోంది.
9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు.. ఏడేళ్ల బాలిక సాహసం!
Mountaineer Rohit: 'నాన్నకు ప్రేమతో.. నీ కోసం ఎవరెస్ట్ అధిరోహిస్తా'