Mother Heart Attack by Death of Foster Son : పెంపుడు కుమారుడు మృతి చెందడంతో మృత దేహాన్ని చూసి తట్టుకోలేక మనోవేదనకు గురై తల్లి కూడా హఠాన్మరణం చెంది మరణంలోను తల్లి కుమారుడి వీడని బంధంగా నిలిచిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శనిగపురం గ్రామానికి చెందిన మంద వెంకన్నకు ఇద్దరు భార్యలు స్వరూప, జ్యోతి. స్వరూపకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, జ్యోతికి ఒక కుమర్తె, ఒక కుమారుడు ఉన్నారు. వెంకన్న, స్వరూపలు గత కొద్ది కాలం క్రితం మృతి చెందారు.
వీరి కుమారుడు మంద రవి(32) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఖమ్మంలో ఉంటున్న పెంపుడు తల్లి జ్యోతి కుమారుడి మృతి చెందాడని తెలుసుకొని శనిగపురం గ్రామానికి వచ్చి కుమారుడు మృతి దేహాన్ని చూసి మనోవేదనకు గురై హఠాన్మరణం చెందారు. గ్రామంలో పెంపుడు తల్లి, కుమారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవికి భార్య, కుమారుడు ఉన్నారు. రవి అంత్యక్రియలకు గానూ తన నాలుగేళ్ల కుమారుడు తలకొరివి పెట్టడంతో గ్రామస్తులు ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది బిడ్డా అని కన్నీటి పర్యంతమయ్యారు.
కుమారుడు మరణవార్త తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి : కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పోటుతో తండ్రి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు సాయికుమార్ (22) ఐదు రోజుల కిందట రెంజల్ మండలం కందకుర్తి గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. అయితే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి దేవర్ల వెంకటేశ్ (54) గురువారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో హార్ట్ అటాక్‌తో మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. తండ్రీకొడుకుల మృతితో బెల్లాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Young Girl Commits Suicide After Mother Death : తల్లి మరణం తట్టుకోలేక మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టేక్మాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో చిన్న ఆమె ఎనిమిదో తరగతి చదివి ఇంటివద్దే ఉంటోంది. తొమ్మిది నెలల క్రితం ఆమె తల్లి అనారోగ్యంతో మృత్యువాత చెందింది.
అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ చిన్న కుమార్తె తరచూ బాధపడేది. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కొంతసేపటికి ఇంట్లోకి వచ్చిన కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.