Mothe Vagu Bridge Works in Karimnagar : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదల దాటికి రోడ్డు మార్గంలో ఉండే వంతెనలు కూలిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం సమీపంలోని మోతె వాగు పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. మోతె వాగుపై 2017లోనే కొత్త వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ప్రారంభంలో శరవేగంగా జరిగిన పనులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి వచ్చే సరికి నెమ్మదించాయి.
రూ.7 కోట్లతో వంతెన ప్రధాన భాగం పూర్తయినప్పటికీ అప్రోచ్ రహదారి కోసం భూసేకరణ జరగలేదు. పరిహారం చెల్లించకపోవడంతో అప్రోచ్ రోడ్ల భూ యజమానులు పనులను అడ్డగించారు. అప్పటి నుంచి వంతెన పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు పాత వంతెన పైనే ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మోతె వాగుకు భారీగా వరద రావడంతో ఆ వంతెన కూడా పూర్తిగా దెబ్బతింది.
ఎమ్మెల్యే చొరవతో ప్రారంభమైన పనులు : మోతె వాగు వంతెన పైనుంచి దాదాపు 50 గ్రామాల ప్రజలు నిత్యం కరీంనగర్, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా ఈ వంతెనే దిక్కు. వరదలతో పాత వంతెన పూర్తిగా కొట్టుకుపోగా, ప్రత్యామ్నాయంగా నిర్మించాల్సిన వంతెన పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోవడంతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ల ఎదురుచూపులకు ఇప్పటికి ఫలితం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ వైపల్యం : గత ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి విముఖత చూపడంతోనే వంతెన అర్థంతరంగా నిలిచిపోయిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్వాకంతోనే దాదాపు 50 గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇన్నాళ్లూ పాత వంతెనపై ప్రయాణాలు చేశారని వెల్లడించారు. ప్రస్తుతం రైతులతో మాట్లాడి వంతెన పనులు ప్రారంభించినట్లు తెలిపారు. తొందరలోనే భూ యజమానులకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదకరంగా మారిన రహదారిని దృష్టిలో పెట్టుకొని వంతెన నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.