Fake Certificates in Software Field : విద్యార్హతలు నకిలీ, అనుభవం నకిలీ, ఇంటర్వ్యూ నకిలీ, చివరికి మనుషులూ కూడా నకిలీనే. సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగంగా జరుగుతున్న ఈ మోసం సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు పెనుభూతంలా పరిణమించింది. భారతీయ విద్యార్థుల విశ్వసనీయతపై విదేశీ కంపెనీలు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.
ఓ మాఫియాలా తయారైంది : ఇంతింతై అన్నట్లు ఇప్పుడు నకిలీ వ్యవహారం ఒక మాఫియాలా మారింది. ఎంతగా అంటే సోషల్ మీడియాలో వివిధ సంస్థల పేర్లతో ‘నకిలీ’ని అమ్ముకుంటున్నారు. నకిలీ విద్యార్హత, అనుభవ పత్రాలనే కాదు నకిలీ ఇంటర్వ్యూలను కూడా ఏర్పాటు చేస్తామని బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు. వీటిలో కొన్ని ప్రకటనలు హైదరాబాద్ చిరునామాతో నడుస్తుండటం గమనార్హం.
ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉద్యోగం కావాలనుకునేవారు సంప్రదిస్తే చాలు మిగతావన్నీ తామే చూసుకుంటామంటూ ప్రకటనలతో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ ఇంట్లో పదుల సంఖ్యలో భారతీయ విద్యార్థులను పట్టుకున్న విషయం తెలిసిందే. వారితో అక్రమంగా ఉద్యోగాలు చేయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్ : కోవిడ్ తర్వాత నుంచి ఇంట్లో ఉండి పనిచేసుకోవడం ఎక్కువైంది. ఈ విధానం లాభదాయకంగా ఉండటంతో సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ప్రోత్సహించాయి. దీన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరు అధికంగా సంపాదించాలని రెండు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి ‘మూన్‌లైట్ జాబ్’ అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడిది మరో దశకు చేరుకుంది.
ఒకే వ్యక్తి మూడు, నాలుగు ఉద్యోగాలు పొందుతాడు. ఒకటి తాను చేస్తే మిగతావి ఇతరులకు అప్పగిస్తాడు. వాటికి సంస్థ నుంచి వచ్చే జీతాన్ని తాను తీసుకొని అందులో కొంత ఆ పని చేసిన వారికి ఇస్తాడు. అమెరికాలో ఇలాంటి దళారులు పెద్దఎత్తున ఉన్నారని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎండీ ఇటీవల వెల్లడించారు.
దెబ్బతింటున్న విశ్వసనీయత : ఈ వ్యవహరంలో ఫిర్యాదులు రాకపోవడంతో తాము ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అసలు, నకిలీ తేడా తెలుసుకునే సదుపాయం తమకు లేకపోవడంతో మోసపోతున్నామని, ఒకవేళ బయటపడితే ఉద్యోగం నుంచి తొలగించడం మినహా ఏమీ చేయలేకపోతున్నామని సాఫ్ట్‌వేర్ కంపెనీలు చెబుతున్నాయి.
ఇలాంటి వ్యవహారాల కారణంగా భారతీయ విద్యార్థుల విశ్వసనీయత తగ్గుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇటీవల అమెరికాలోని కొన్ని సంస్థలు జీఆర్‌ఈ స్కోరింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య - అతడి పనేనా? - Software Woman Murdered in Miyapur