Congress Leader Murder in Jagtial : జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రధాన అనచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న ఆయనను కారుతో ఢీకొట్టి తర్వాత కత్తితో పొడిచి సంతోష్ అనే యువకుడు హత్య చేశాడు. ఈ ఘటనకు నిరసనగా ధర్నా నిర్వహించిన జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. ఈ హత్య జగిత్యాలలో రాజకీయంగా తీవ్ర దూమారం రేపింది.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిని 20 ఏళ్ల వయస్సున్న సంతోష్ అనే యువకుడు దారుణంగా హత మార్చాడు. పథకం ప్రకారం ముందుగా హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని వెంటాడి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన గంగారెడ్డిపై 20కిపైగా కత్తిపోట్లు పొడిచాడు. హత్య చేసి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన ఊపిరితో ఉన్న ఆయనను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
Congress MLC Jeevan Reddy Comments : ఘటన అనంతరం ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అత్యంత సన్నిహితుడు హత్యకు గురి కావటంతో జీవన్‌రెడ్డి తీవ్ర అగ్రహానికి గురయ్యారు. మాకే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుందంటూ జగిత్యాల పాత బస్టాండ్ వద్ద కార్యకర్తలో కలిసి ధర్నాకు దిగారు. కొద్దిసేపటికి ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేరుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినా మీకో దండం మీ పార్టికో దండం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా ధర్నా నిర్వహించిన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ, పోలీసుల తీరుపై మండిపడ్డాడు.
నేను పార్టీలో ఉండలేను : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ చేయడంతో జీవన్‌రెడ్డి ఆవేదనతో మాట్లాడారు. తాను పార్టీలో ఉండలేనని ఆవేదనగా ఫోన్‌పెట్టేశారు. పార్టీ ఫిరాయించిన వారి ప్రొత్సహంతోనే ఈ హత్య జరిగిందని ఫిరాయింపులు అవసరమా? అంటూ కాంగ్రెస్ పార్టీపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్య చేసిన కొద్దిసేపటికే నిందితుడు సంతోష్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుణ్ని ప్రస్తుతం మల్యాల పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలను పరిశీలిస్తే గ్రామంలో గత కొన్నేళ్లుగా రెండు వర్గాలు కొనసాగుతున్నాయి. భూవివాదాలు వీటికి తోడైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
హత్యను ఖండించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ : మరో వైపు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు కార్యకర్తలు మాట్లాడటంతో తాను హత్యను ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ పోలీసులను కోరారు. కొన్నాళ్లుగా జగిత్యాలలో ఎమ్మెల్యే వర్గం, జీవన్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ హత్యతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయనే ఆందోళన నెలకొంది.
గల్ఫ్ కార్మికులకు అండగా నిలవండి - సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి లేఖ
చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు చెల్లించండి - రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి విజ్ఞప్తి