'వైఎస్సార్సీపీని కాంగ్రెస్‌లో కలిపేందుకు జగన్ సిద్ధం- బెంగళూరులో డీకే శివకుమార్‌తో చర్చలు' - nallamilli comments on jagan - NALLAMILLI COMMENTS ON JAGAN
MLA Nallamilli Comments on YSRCP Merge in Congress: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీని కాంగ్రెస్‌లో కలిపేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారన్నారు. దానికి అనుగుణంగా బెంగళూరులో పావులు కదిపారని వ్యాఖ్యానించారు.


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 3:33 PM IST
MLA Nallamilli Comments on YSRCP Merge in Congress: అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అందుకే బెంగళూరుకు వెళ్లారని, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో జగన్ చర్చలు జరిపారని పేర్కొన్నారు.
షర్మిల బయటకు వెళ్తేనే: అయితే దీనికి జగన్ ఒక కండిషన్ పెట్టారని తెలిపారు. తన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే వైఎస్సార్సీపీని విలీనం చేస్తానని జగన్ అన్నట్లు నల్లమిల్లి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని, అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.
వాళ్లంతా ఉంటారో లేదో తెలియదు: ప్రస్తుతం గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా జగన్ మోహన్ రెడ్డితో ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఉందని నల్లమిల్లి వ్యాఖ్యానించారు. చివరికి రాజ్యసభ సభ్యులు కూడా తనతో ప్రయాణం చేస్తారో లేదో తెలియదని అన్నారు. అందుకే దిక్కుతోచని స్థితిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారని ఆరోపించారు.
కార్యకర్తలే జగన్‌పై దాడి చేశారు: ఎమ్మల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరిన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేశారని అన్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ కనీసం పులివెందుల వైపు చూడలేదని ఎద్దేవా చేశారు.
"2019 నుంచి 2024 వరకూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ అప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ప్రజలంతా కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. దీని ద్వారా తెలుస్తోంది ఏంటంటే, నియంత పాలనను ప్రజలు ఎప్పుడూ కూడా ఆమోదించరని స్పష్టంగా అర్ధం అవుతోంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్నటి రోజున కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జగన్ భేటీ అయ్యారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధం అని తెలిపారు.
అంతటి నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవండం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలలో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా తనతో ఉంటారో లేదో కూడా తెలియదు. సాక్షాత్తూ పులివెందులకు వెళ్తే, కార్యకర్తలే దాడి చేశారు. కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు గానీ, గెలిచిన అభ్యర్థులు గానీ కనీసం పులివెందుల వైపు చూడని పరిస్థితి ఉంది. ఇటువంటి దిక్కుతోచని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయిస్తున్నారు. - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే