GPS Tracking Help For Anti Theft Solution and Recover Stolen Vehicles : ఇటీవల కాలంలో ఆటోలు, ద్విచక్ర వాహనాల చోరీపై పోలీసులకు అధిక ఫిర్యాదులు అందుతున్నాయి. లారీలు, బస్సులు, కార్లను సైతం కేటుగాళ్లు అపహరించుకెళుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. చోరీల తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొంగను పట్టుకోవడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతోంది. కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి దొంగలు దొరకపోవడంతో ఆ వాహనాలను మర్చిపోవాల్సిన పరిస్థితి. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనం కొనుగోలు ఆర్థికంగా భారమే. అలాంటి వాటిని నేరగాళ్లు నిమిషాల్లో అపహరించుకెళ్లడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతం.
మార్కెట్‌లో ట్రాకింగ్ పరికరాలు : ఇలాంటి దొంగతనాల కట్టడికి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. నాణ్యతను బట్టి రూ.1000 నుంచి అందుబాటులో ఉన్నాయి. వాటిని కార్లు, ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనాలు ఇలా అన్నింటికి అమర్చుకోవడం వల్ల ఆ వాహనాలను దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు.
చరవాణికి సంక్షిప్త సందేశం : జీపీఎస్ అమర్చాక యాప్ ద్వారా చరవాణికి అనుసంధానం చేసుకోవచ్చు. వాహనం పార్కింగ్ చేసిన చోటు నుంచి దొంగలు అపహరించుకెళ్తుంటే వెంటనే శబ్దాలు రావడంతోపాటు చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తం కావొచ్చు. ఒకవేళ వాహనం తస్కరించుకెళ్లినా ఎక్కడ ఉందనేది జీపీఎస్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. తద్వారా పోలీసుల సాయంతో ఆ వాహనాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు.
రాత్రికి రాత్రే మాయం : గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేటకు చెందిన వెంకటేశ్వరరావు తన ఇంటి ముందు నిలిపిన ద్విచక్రవాహనం మరుసటి రోజు ఉదయం చూస్తే కనిపించ లేదు. ఆర్టీసీ కాలనీకి చెందిన హరి ఓ కల్యాణమండపం వద్ద వాహనం పార్కింగ్ చేసి వేడుక ముగిశాక వచ్చి చూస్తే కనిపించలేదని, దొంగలు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాహనాలను గుర్తించొచ్చు : జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే వాహనాలకు భద్రత ఉంటుందని గుంటూరు నేరవిభాగ ఏఎస్పీ సుప్రజ తెలిపారు. నేరస్థులు ఆ వాహనాలను చోరీ చేసి తీసుకువెళ్లి ఎక్కడైనా దాచిపెడితే పోలీసుల సాయంతో వాటిని గుర్తించి తీసుకురావచ్చని వివరించారు.
ప్రమాదాల నివారణకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ - ఇకపై ప్రతి వాహనానికీ జీపీఎస్
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ - స్విఛ్ ఆఫ్‌లో ఉన్నా ఈజీగా కనిపెట్టేయండిలా! - Missing Mobile Tracking