Minister Uttam comments on BRS : గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కక్కుర్తి పడి, ప్రాజెక్టులు కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ చర్యలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
గోబెల్స్ రామారావు : కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన తన పేరును జోసెఫ్ గోబెల్స్ రామారావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రతిసారీ అసత్యపు మాటలతో జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవం ఎంటో ప్రజలందరికి తెలుసన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల విషయంలో స్పష్టమైన వైఖరీతో ఉన్నామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల మరమ్మతులకు నిపుణుల సలహాలతో ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లీస్తామని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిరోజు సమీక్షలు జరుపుతున్నామని యుద్ధ ప్రాతిపదికన నిర్మస్తామని తెలిపారు.
ఆయకట్టుపై దృష్టి : రాష్ట్రంలో ఏటా ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 15 రోజులకొకసారి పనుల పురోగతిపై సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై కొంత స్పష్టత రావటం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రూ.10,820 కోట్ల పనులపై ఖర్చుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ పనులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీర్ల అందరితో సమీక్షించామన్నారు. వర్షాకాలం కాబట్టి నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించామని తెలిపారు.
"గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కక్కుర్తి పడి ప్రాజెక్టులు కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన తన పేరును జోసెఫ్ గోబెల్స్ రామారావుగా మార్చుకోవాలి. ప్రతిసారీ అసత్యపు మాటలతో జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు". - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి