Minister Uttam Kumar Reddy Meet Irrigation Department Officials : కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, అధికారులకు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునళ్లలో ఉన్న అంశాలపై మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్ రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు.
కృష్ణా నది జలవివాదాల రెండో ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో ఉన్న వివిధ అంశాల పరిస్థితి, ముందుకెళ్లాల్సిన మార్గాలను సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరించారు. 2015లో ఏపీతో కృష్ణా జలాల విషయంలో కేవలం ఆ ఏడాదికి మాత్రమే అడ్ హక్ పద్ధతిన అంగీకారం కుదిరినట్లు చెప్పారు. ఈ క్రమంలో కృష్ణా జలాల్లో తగిన వాటా కోసం ట్రైబ్యునల్ ముందు ప్రయత్నించాలని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాల్లో 50:50 వాటా కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు.
Minister Uttam Kumar Reddy Meeting at Jalasoudha : అయితే సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్ అవార్డు అంశాన్ని మహారాష్ట్ర, కర్ణాటకతో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మేలని వైద్యనాథన్ సూచించారు. ఈ ప్రతిపాదనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. అయితే శ్రీశైలం, సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని మంత్రి అన్నారు. కృష్ణా జలాల్లో వాటా, ప్రజల ప్రయోజనాల కోసం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందేనని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు, సీనియర్ న్యాయవాదులకు సూచించారు. కృష్ణా జలాల విషయంలో విభజన జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు.
మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదం : మంత్రి ఉత్తమ్