Minister Tummala Nageswara Rao letter to Central Govt : జాతీయ పసుపు బోర్డును తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేయాలనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్షనని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన తెలిపారన్నారు.
అప్పుడు కేంద్రం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు స్పష్టమైన వాగ్దానం ఇచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఆ తర్వాత అక్టోబరు 4, 2023న పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని గుర్తు చేశారు. అందులో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదన లేకుండా కేవలం కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి వివరాలను మాత్రమే గెజిట్లో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
National Turmeric Board in Telangana : ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2019-20 ఏడాదిలో 1,39,698 ఎకరాల విస్తీర్ణంలో పసుపు సాగు చేయగా 3,35,425 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చిందని లేఖలో వివరించారు. అదే విధంగా 2022-23 సంవత్సరంలో 56,174 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా 1,73,610 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగిందని తెలిపారు.
ఇప్పుడు 2023-24 ఏడాదిలో మాత్రం 34,978 ఎకరాల సాగు విస్తీర్ణానికి పసుపు సాగు పరిమితం అయిందని లేఖలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు రైతులను బలోపేతం చేయడం కోసం ధరల స్థిరీకరణతో పాటు సాగు విస్తీర్ణం పెంచడానికి పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి అవకాశాలు పెంచడానికి జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పసుపు రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని
ఇదీ జరిగిన విషయం : నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు గురించి ఆ ప్రాంత రైతులు ఎన్నో ఉద్యమాలు చేశారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిరసిస్తూ 2019 పార్లమెంటు ఎన్నికల్లో సుమారు 179 మంది రైతులు నామినేషన్ వేసి లక్ష ఓట్లు సాధించారు. అయితే 2023లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల పర్యటనలో భాగంగా పాలమూరు జిల్లాలో నిర్వహించిన బీజేపీ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Farmer Wear Chappal After Turmeric Board : పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులు వచ్చాయ్..!