Minister Sridhar Babu Comments On BRS : కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రతిపక్షనాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పరిపాలన కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు.
శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట గజానన సంస్థ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.
Sridhar Babu Comments On BRS : కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో కనిపిస్తోందని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడైన గాంధీ తాను కారు పార్టీ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించారన్నారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాల్లో తాము కలుగజేసుకోమని, వాటిని ఆ పార్టీయే పరిష్కరించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని శ్రీధర్ బాబు తెలిపారు.
ఎవరు తెలివిగలవారో ప్రజలే చెబుతారనీ, రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రజలందరూ తెలంగాణ వాసులేనని, వారందరినీ గౌరవిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చేసినా నగర ఇమేజ్ను కాపాడుతామని స్పష్టం చేశారు.
"హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెద్ద ఎత్తున అంతర్జాతీయస్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలనే కార్యచరణను తీసుకున్నాం. హైదరాబాద్ రాష్ట్రానికి, ప్రజానికానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఎవరు తెలివితేటలు చూపెడుతున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత విబేధాలకు సంబంధించి మీరు పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై రుద్దకూడదు"- శ్రీధర్ బాబు, మంత్రి
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు : 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు(బీఆర్ఎస్) 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతిభద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేవిధంగా మాట్లాడితే పొరపాటు అవుతుందని మంత్రి పొన్నం అన్నారు. బీఆర్ఎస్ మాటలు చూస్తుంటే రాష్ట్రం అల్లకల్లోలం కావాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశం న్యాయస్థానంలో ఉందని, వినాయక నిమజ్జనం అయ్యేంతవరకు రాజకీయ విమర్శలు మానుకోవాలని కోరారు.