Telangana Anganwadi Recruitment 2024 : రాష్ట్రంలో 11 వేల అంగన్‌వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే (నర్సరీ) స్కూళ్లను ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు. గురువారం ‘ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను మంత్రి సీతక్క వివరించారు.
స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్‌వాడీలదే కీలకపాత్ర అని మంత్రి సీతక్క అన్నారు. లోపాలను అరికట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టు రెండేళ్ల పాటు ఒకే గుత్తేదారుకు ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనలు మార్చామన్న ఆమె ఆహారం, గుడ్ల సరఫరా పకడ్బందీగా సాగుతోందని అన్నారు. అంగన్‌వాడీలకు ఫర్నిచర్, ఇతర సామగ్రిని సమకూర్చినట్లు పేర్కొన్నారు. వాటిలో 11 వేల ఖాళీలను గుర్తించామని చెప్పిన మంత్రి త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
35వేల అంగన్‌వాడీ కేంద్రాలు : ఉద్యోగ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు రూ. లక్ష చెల్లిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా 15 వేలల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీని కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని అన్నారు. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామని తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతారని వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50శాతం రాయితీ అంశం సర్కార్ పరిశీలనలో ఉంది : సీతక్క
మహిళల కోసం ప్రత్యేక భద్రత కార్యక్రమం : వచ్చే నాలుగేళ్లలో ప్రతి పల్లెకు తారురోడ్లు, వాగులపై వంతెనలు నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పల్లెల్లో ప్రగతి కుంటుపడిందని, నిధుల కొరత తీవ్రంగా ఉందని, వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నామని అన్నారు.
'మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉంది. తీసుకున్న అప్పులు, వాటికి చెల్లించాల్సి వస్తోంది. గత ప్రభుత్వం ప్రధాన పద్దుల నిధులను పెండింగులో పెట్టింది. మేము అదే భారాన్ని మోస్తున్నాం. దశలవారీగా బిల్లులను కడుతున్నాం. గ్రాంట్లు విడుదల చేస్తున్నాం. బహుళ విధ కార్మికులకు పది నెలల పెండింగ్ జీతాలను చెల్లించాం. పంచాయతీల నిర్వహణకు నిధులు ఇచ్చాం.' అని సీతక్క అన్నారు.