Minister Sandhya Rani Visited Government Hospital in Parvathipuram : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదంతా గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలేనని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వైద్యులు వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిద్దామనే ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు. సాలూరు ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సంధ్యారాణి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించి, ఇంజనీరింగ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి వీలైనన్ని ఎక్కువ కేసులు ఇక్కడే ట్రీట్ చేయాలని సూచించారు.
సరైన వసతులు పరికరాలు లేకపోతే నాకు చెప్పండంటూ సిబ్బందిని, వైద్యులను కోరారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే అవసరం రానివ్వకుండా ఇక్కడ వైద్యులే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫీడర్ అంబులెన్స్‌లు సిద్ధం చేసుకోవాలని, అవన్నీ కచ్చితంగా పని చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు. 'గిరిజనులు అంతా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన.' అది కచ్ఛితంగా అమలు చేయాల్సిందేనని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.
కొత్త క్యాబినెట్ మంత్రులకు ఛాంబర్‌లు కేటాయింపు - Allotting chambers to ministers
ఇటీవల రైతులను కలిసిన గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వారితో పలు అంశాల గురించి చర్చించిన విషయం తెలిసిందే. అన్నదాతలు కోరిన విత్తనాలే ఇవ్వాలని, లేవని చెప్పి ఏవేవో రకాలు బలవంతంగా కట్టబెట్టవద్దని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు వ్యవసాయాధికారి కార్యాలయంలో పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులతో పాటు సాగునీరు అందించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు అందించే కార్యక్రమాలకు ముహూర్తాలు అంటూ ఏమీ చూడమని, వారికి మేలు జరిగితే చాలన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కొనుగోలు చేసి రెండు వారాల్లో డబ్బులు అందిస్తామన్నారు. మళ్లీ రైతు రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం అన్నారు. నకిలీ విత్తనాలతో రైతులను వ్యాపారులు మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 1.13 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రూ.22.77 కోట్లు జమ అవుతున్నట్లు చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్, ఏడీ మధుసూదనరావు, ఏవోలు అనూరాధ, తిరుపతిరావు పాల్గొన్నారు. 'అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం'- మంత్రిగా సంధ్యారాణి బాధ్యతలు - Minister Sandhya Rani Take Charge