Minister Ponnam Reacts On jagadish Reddy Comments : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతనే ఖాళీ చేయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్య తదితర వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీసీ సంక్షేమశాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన కొనసాగుతుందని పొన్నం వివరించారు. ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదు పడిపోతదని ఇష్టమున్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడిన మంత్రి పొన్నం ఇప్పటికైనా వాళ్లు తమ పద్దతి మార్చుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరెన్ని సెటైర్లు వేసినా ఉద్యోగ నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసమని అన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ఇవాళ పొన్నం గాంధీభవన్‌కు వచ్చారు. తెలంగాణ అక్కా చెల్లెళ్లకు అందరికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని మిగిలిన హామీలు కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇస్తామన్నారు.
జగదీశ్ రెడ్డి మా పది నెలల పాలనపై చర్చకు సిద్ధమా అంటున్నావు మీరు పదేళ్లల్లో ఏం పాలించారో తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తుందని విద్యార్ధి, నిరుద్యోగులు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం 150 మందికి విదేశీ విద్యానిధి ఇవ్వగా కాంగ్రెస్ 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని ఈ సందర్భంగా పొన్నం పేర్కొన్నారు.
"మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నాం. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటాం. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతాం’’ -పొన్నం ప్రభాకర్, రవాణశాఖ మంత్రి