Minister Ponnam Reaction On Konda Surekha Issue : సహచర మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తరువాత కూడా సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల మహిళా మంత్రి కొండా సురేఖ ఒంటరి కాదు అని హెచ్చరించారు. ఇవాళ గాంధీభవన్‌లో చిట్ చాట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారన్నారు. ఆ తరువాత కూడా పలువురు స్పందించడం సరియైనది కాదన్నారు.
మొన్న బీజేపీ, ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీలు రైతుల కోసం ఆందోళన చేశారంటే తాము ముందు నుంచి అనుకున్నట్లుగానే ఒకరి తరువాత ఒకరు రైతుల కోసం ఆందోళన చేశాయంటే, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. రాష్ట్రంలో వరద నష్టం రూ.10 వేల కోట్లు జరిగితే కేంద్రం కేవలం రూ.400 కోట్లు ఇచ్చిందని మంత్రి పొన్నం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారం నుంచి దిగిపోయే సమయానికి రూ.40 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. బతుకమ్మ చీరలకు కూడా బకాయి పెట్టి పోయినట్లు విమర్శించారు.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలను నెరవేరుస్తాం : ఈ పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రజా ప్రభుత్వం పాలన విజయవంతంగా కొనసాగిందని వివరించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నిర్మాణాత్మక అభివృద్ధిని చేసుకుంటూ పోతున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎంతో చర్చించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. సమస్యల పరిష్కారానికి సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని అన్నారు. గురుకుల స్కూళ్లలో చాలా వాటికి సొంత భవనాలు లేవన్న మంత్రి, మెస్, డైనింగ్ హాళ్లకు గ్రీన్‌ఛానెల్ ద్వారా నిధులివ్వాలని కోరినట్లు తెలిపారు. గురుకుల స్కూళ్లలో పాములు, దోమలు లేకుండా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
మళ్లీ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ - ఈసారి ఏమన్నారంటే? - Minister Konda Surekha Comments