Minister Ponnam interacted with Farmers : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిగురమామిడి మండలంలోని చిన్న ముల్కనూరుకు వెళ్తుండగా, దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులు వ్యవసాయ కూలీలతో కాసేపు సంభాషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలును మంత్రి రైతులకు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే లక్ష, లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ఓ మహిళా రైతు, తమ పెళ్లై పది సంవత్సరాలు అవుతోందని కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని, కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడు చేర్చుతారని మంత్రిని అడిగారు.
దీనికి పొన్నం స్పందిస్తూ కొత్త రేషన్ కార్డులను త్వరలో జారీ చేస్తామని పేర్కొన్నారు. ఒక వేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు మంత్రి పొన్నం సూచించారు. తమ ప్రభుత్వంలో పంటల భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదని మంత్రి తెలిపారు. నాట్లు వేస్తుండగా మహిళా రైతులు పాడిన పాటను మంత్రి ఆసక్తిగా గమనించారు.
మంత్రి : అందరికి రుణమాఫీ అయ్యిందా? ప్రభుత్వం ఇంటికి రూ, 2 లక్షల రుణమాఫీ చేస్తుంది.
మహిళ రైతు : మాకింకా కాలేదు సర్
మంత్రి : మీ ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్‌తో ఏఈవోని కలవండి. సమస్యను పరిష్కరిస్తారు
మహిళ కూలీ : సర్ మా పెళ్లై పది సంవత్సరాలవుతోంది. కొత్త రేషన్‌కార్డులు ఎప్పుడు ఇస్తారు?. రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడు చేర్చుతారు.
మంత్రి : ప్రభుత్వం త్వరలోనే అందరికి నూతన రేషన్‌కార్డులు జారీచేస్తుంది. అలాగే పంటబీమాల పథకాన్ని అమలు చేస్తున్నాము. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాము.
మంత్రి : సరే నేను వెళ్లొస్తా బై! బై!