Minister Ponnam on Kallu Bars : నేటికాలంలో అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని, వాటితో పాటు గీత కార్మికుల కులవృత్తిని ఆధునీకరించుకునే అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో "కల్లు బార్లు" ఏర్పాటు చేసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రకృతిపరంగా వచ్చే పానీయాన్ని కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా చర్యలు చేపడతామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో(Minister Jupally) కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 90 రోజులైందని, ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయణం చేశారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, కేంద్రంలోనూ మన రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులు ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వివక్షకు గురయ్యిందని, జిల్లాలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
"నేటికాలంలో అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోంది. వాటితో పాటు గీత కార్మికుల కులవృత్తిని ఆధునీకరించుకునే అవసరం ఉంది. రాబోయే రోజుల్లో "కల్లు బార్లు" ఏర్పాటు చేసుకునే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నాము. ప్రకృతిపరంగా వచ్చే పానీయంను కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా చర్యలు చేపడుతాము". - పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
Minister Jupally Fires on BRS : రాబోయే ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గడిచిన శాసనసభల్లో లక్ష కోట్లు అప్పు మాత్రమే ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. ఏడాదికి రూ.60 వేల కోట్ల రూపాయల వడ్డీతో కలుపుకొని, రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి దుయ్యబట్టారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన పొన్నం ప్రభాకర్ - త్వరలోనే మిగతా హామీలు అమలు చేస్తామన్న మంత్రి
"రాబోయే ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు లేదు. గడిచిన శాసనసభల్లో రూ.లక్ష కోట్ల అప్పు మాత్రమే ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఏడాదికి రూ.60 వేల కోట్ల వడ్డీతో కలుపుకొని రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారు". - జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి
ఆత్మసాక్షి ఉంటే రాజీనామా చేయాలి - హరీశ్‌రావుకు జూపల్లి సవాల్
హుస్నాబాద్ అభివృద్ధిపై మాట్లాడితే - నా తల్లినే అవమానిస్తారా? : మంత్రి పొన్నం