Minister Ponguleti Srinivas Reddy on Ration Cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని చెప్పారు. శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్వీట్ చేశారు.
"ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేయడం జరుగుతుంది." - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి ట్వీట్
పదేళ్లుగా భాగ్యంలేని రేషన్‌కార్డులు జారీ : తెలంగాణ ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా రేషన్ కార్డులు మాత్రం లబ్ధిదారులకు జారీ చేయలేదు. అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నామని చెప్పుకునే గత ప్రభుత్వం హాయాంలోనే ఈ తంతు అంతా జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ఏవైనా లబ్ధిదారుడి వరకు చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డును పదేళ్లుగా చేపట్టలేదు. దీంతో సంక్షేమ పథకాలు అందుకునే వారు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఈ రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలు వంటివి వస్తాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు రేషన్‌కార్డు లేక చాలా పేద,మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయి. ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.
మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Decisions