AP TET Results Released 2024 : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇందులో 50.79 శాతం మంది అర్హత సాధించారని లోకేశ్ తెలిపారు. ఫలితాల్లో 1,87,256 మంది అర్హత సాధించినట్లు చెప్పారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. ఫలితాలను https://cse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని లోకేశ్ వెల్లడించారు.
అదేవిధంగా ఫలితాలను https://aptet.apcfss.in https://www.eenadu.net https://pratibha.eenadu.net వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3,68,661 మంది హాజరయ్యారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలి. ఉపాధ్యాయ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్-2కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. టెట్‌కు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.
అభ్యర్థులు టెట్ ఫలితాలను ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు
- ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in ను ఓపెన్ చేసుకోవాలి
- హోమ్ పేజీలో, ‘AP TET 2024 Results’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
- దానిపై క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
- అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
- వెంటనే అభ్యర్థుల టెట్ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- అనంతరం మీ రిజల్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అదే విధంగా దీనిని ప్రింట్‌అవుట్‌ని తీసుకుని ఉంచుకోవడం ఉత్తమం.