Minister Nara Lokesh Launches WhatsApp Governance in AP : దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌరసేవలు అందివ్వడంతో పాటు వినతులు స్వీకరిస్తారు. అలాగే వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
వాట్సప్ ద్వారా తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు.
జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం - బయటపెట్టిన అసర్ నివేదిక
ఈ సందర్బంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ " మాది ప్రజా ప్రభుత్వం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది ప్రజలను కలిశాను. గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. వాట్సప్ అందరూ వాడే ఫోన్ అప్లికేషన్. వాట్సప్‌లో 360 సేవలను అందుబాటులో ఉంచుతాం. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశమే లేకుండా వాట్సప్ గవర్నెన్స్ ఉండబోతోంది. రెండో విడతో వాట్సప్ గవర్నెన్స్‌కు ఏఐని కూడా జోడిస్తాం.
ప్రపంచంలో ఇదే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇదే అంతిమం అని చెప్పబోవట్లేదు ఇంకా మెరుగుపరుస్తాం. ప్రతి సర్టిఫికెట్ మీదా క్యూఆర్ కోడ్ ఉంచుతాం. క్యూఆర్ కోడ్ ద్వారా అభ్యర్థుల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. సర్టిఫికెట్లలో ఏ తప్పులు ఉన్నా సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తాం. బటన్ నొక్కితే ఎన్నో ఆర్డర్లు వచ్చినప్పుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రాకూడదు. ప్రభుత్వం నూతన సేవలందించే ప్రక్రియలో భాగమే ఈ వాట్సప్ గవర్నెన్స్" అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్‌డే' - ఉపాధ్యాయులకు ఒకటే యాప్: మంత్రి లోకేశ్
"మొత్తంగా 520కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. వాట్సాప్ సేవలన్నీ పూర్తి ఉచితం, ఏదైనా బుక్ చేసుకున్నప్పుడే చెల్లింపులు చేయాలి. రియల్ టైమ్‌లోనే అన్ని సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షల హాల్ టిక్కెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తాం. చాలా సందర్భాల్లో సర్టిఫికెట్ నిజమైందా? కాదా? అని ధ్రువీకరణకే చాలా సమయం పోతుంది. తాజా విధానం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది" అని మంత్రి లోకేశ్ తెలిపారు.
విద్యార్థి పేరు తప్పు - NTAతో మాట్లాడిన మంత్రి లోకేశ్ - 30 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్