Telugu Pilgrims Stuck in Kedarnath : కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా స్వస్థలాలకు తెచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాల కారణంగా నలుగురకు చిక్కుకుపోయారు. తమ సమస్యను ట్వీట్ ద్వారా లోకేశ్‌కు తెలిపారు. భోజనం కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
We have constituted a special team that will look into bringing back devotees from Andhra Pradesh stuck in Kedarnath. I will personally monitor and ensure their safe return. https://t.co/ndZkl8noeh
— Lokesh Nara (@naralokesh) September 13, 2024
ధైర్యంగా ఉండండి : అందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకుని దగ్గరుండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. కేదార్ నాథ్‍లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నామని ఈ లోగా వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామని అన్నారు. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు.
హెలికాప్టర్లలో తరలించండి : మరోవైపు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అధికారులతో మాట్లాడామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో కలిశెట్టి మాట్లాడారు. వారిని రక్షించాలని రెసిడెంట్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. యాత్రికుల్లో పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, వారిని హెలికాప్టర్లలో తరలించాలని కోరారు.
ఎలా చిక్కుకున్నారు? : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ఈ నెల 11 నుంచి వారు అక్కడే ఉండిపోయారు. ఏపీ, తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది వెళ్లారు. కేదార్‌నాథ్ దర్శనం తర్వాత వీరిలో 14 మంది తిరుగుపయనం అమయ్యారు. నలుగురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్-బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు, విజయనగరానికి చెందిన ఇద్దరు యాత్రికులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాప్టర్ సర్వీసులను నిలిపేశారు.