MINISTER MANDIPALLI RAMPRASAD REDDY REVIEW: గడచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో క్రీడల శాఖ అవినీతి, అక్రమాలమయమైందని, వీటిన్నింటిపైనా విచారణ జరిపిస్తామని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP)లో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, నకిలీ దృవపత్రాల కుంభకోణం జరిగినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
గత ప్రభుత్వంలో 120 కోట్లను ఆడుదాం ఆంధ్ర కోసమంటూ 40 రోజుల్లోనే ఖర్చుపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు పేరు చెప్పి ఆంధ్రాను అభాసుపాలు చేసిందని ధ్వజమెత్తారు. సీఎంతో చర్చించి కమిటీ వేసి శాప్‌లో జరిగిన అన్ని అక్రమాలను తేల్చుతామన్నారు. శాఖలను ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుతో సమావేశానికి ముందు విజయవాడలో శాప్ కార్యాలయంలో ఉన్నతాధికారులుతో సమీక్షించారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
క్రీడల స్టేడియంలు నిర్మాణం,అభివృద్ధి సహా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అంశాలపై చర్చించామన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కారు క్రీడలను నిర్వీర్యం చేసిందన్న మంత్రి, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, ఉద్యోగాలకు సంబంధించి పలు అక్రమాలు జరిగాయన్నారు. రాజధాని అమరావతిలో క్రీడల కోసం స్టేడియంలు నిర్మిస్తామని, వచ్చే ఐదేళ్లలో క్రీడలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. నిజమైన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, క్రీడల శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందకు చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహం పేరిట తెచ్చిన పే అండ్ ప్లే జీవో వల్ల ఇబ్బందులు ఉంటే చర్చించి రద్దు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి మెరుగైన సమగ్రమైన పాలసీని తెస్తామన్నారు. నిబంధనల ప్రకారం కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తప్పకుండా క్రీడలకు గ్రౌండ్స్ ఉండాలని, ఆటల కోసం గ్రౌండ్స్ లేని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకూ శాప్ ద్వారా త్వరలో నోటీసులు ఇస్తామన్నారు. నోటీసులకు స్పందించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీలు లేని పక్షంలో ప్రైవేటు పాఠశాల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు.
Minister Ramprasad Reddy Donation to Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనం మొత్తం 3 లక్షల 1 వెయ్యి 116 రూపాయలను చెక్కు రూపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సచివాలయంలో కలసి అందజేశారు.