Minister Lokesh on Tirumala Laddu Issue : గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు టీటీడీలో కూడా అవినీతి చేశారని విద్యాశాఖమంత్రి మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని ఆయన విమర్శించారు. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్ అయ్యానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఇవ్వని మెజార్టీని ప్రజలు తమకు ఇచ్చారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని వారి సమస్యలు తీరుస్తామని పేర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు దేవుడిని ప్రజలకు దూరం చేస్తున్నారని గతంలో చెప్పానని లోకేశ్ గుర్తు చేశారు. వారు చేసిన తప్పులను ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పూతలపట్టు, బంగారుపాళ్యం గ్రామాలు తన గుండెల్లో ఉంటాయని వివరించారు. గతంలో ఓ డీఎస్పీ తనపై దాడి చేస్తే ఇక్కడి ప్రజలు తమకు అండగా ఉన్నారని వెల్లడించారు. బంగారుపాళ్యం గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని తెలిపారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పరిపాలన మొదలైందని విమర్శించారు. జగన్ అరాచకాలు ప్రజలకు తెలియాలనే ప్రజావేదిక శిథిలాలు తొలగించలేదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు లోకేశ్ యువగళంలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ను అదేవిధంగా కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని లోకేశ్ తెలిపారు. చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని మంత్రి చెప్పారు.
యువగళాన్ని అడ్డుకునేందుకు గత ప్రభుత్వం యత్నించిందని లోకేశ్ ఆరోపించారు. కుట్రలను ఛేదించుకుంటూ పాదయాత్ర ముందుకు సాగిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతకుముందు ఉత్తమ కార్యకర్త- మన టీడీపీ యాప్ ఛాంపియన్స్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.
'టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి సవాల్ విసురుతున్నా. లడ్డూ నాణ్యతపై ప్రమాణం చేసేందుకు సుబ్బారెడ్డి సిద్ధమా?. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి షాక్ అయ్యా. లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ చేశారని నివేదికలు వచ్చాయి. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుంది. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలను. క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దిరెడ్డిని వదిలిపెట్టం' - లోకేశ్, మంత్రి
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - Fat In Tirumala Laddu Issue
తిరుమల కొండపై పూలు ధరించకూడదు - ఎందుకో తెలుసా? - NO FLOWERS RULE IN TIRUMALA