Minister Konda Surekha Review On Forest Waste Lands : రాష్ట్రంలో పోడు భూముల సమస్యలపై అధికారులు లోతైన అధ్యయనం చేపట్టి లోటుపాట్లను వెలికితీసి శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలు రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో పోడు భూముల సమస్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, మురళీ నాయక్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.శరత్ పాల్గొన్నారు. పోడు భూములు విస్తరించి ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలు జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలు, డీఎఫ్ఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో పంపిణీ చేసిన పోడు భూముల వివరాలు, పోడు హక్కులు, తగాదాలు, అడవులు ఆక్రమణ తదితర అంశాలపై చర్చించారు.
పోడు హక్కులు, తగాదాలు అంశాలపై చర్చించిన మంత్రులు : అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణ నివారించి సహృద్భావ వాతావరణం నెలకొనేలా విధివిధానాలు రూపొందించాలని సూచించారు. పోడు భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి? ఎంత మందికి పోడు పట్టాల పంపిణీ జరిగింది? పోడు పట్టాలు పొందిన వారిలో అనర్హులెవరైనా ఉన్నారా? స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని? లాంటి అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సునిశిత పరిశీలన చేసి నివేదిక రూపొందించాలన్నారు.
ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్ కింద 6,51,822 దరఖాస్తులు రాగా 2,30,735 మంది పట్టాదారులకు 6,69,676 ఎకరాల పోడు భూమి పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. కమ్యూనిటి ఫారెస్ట్ రైట్స్ కింద 3,427 దరఖాస్తులు రాగా 721 దరఖాస్తుదారులకు పట్టాలు అందించిన క్రమంలో పలు కారణాలతో 1,024 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉంచినట్లు చెప్పారు. పోడు భూముల సమస్యపై ఆదర్శవంత విధివిధానాలు చేశాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించి ఆమోదం లభించేలా ప్రణాళిక రూపొందించాలని సురేఖ అన్నారు.
పోడు పట్టాల కోసం దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోవడం సరికాదు : పోడు పట్టాల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని మంత్రి సీతక్క అన్నారు. అటవీ శాఖ గిరిజన శాఖ మరింత సమన్వయంతో పనిచేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పోడు పట్టాల కోసం దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోవడం సరికాదని సూచించారు.
పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే అదే విషయం వివరించాలని ప్రస్తావించారు. ఎస్టీలు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నివారించాలని చెప్పారు. కొత్తగా అడవులు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచడం సహా అడవుల్లో పండ్ల మొక్కలు పెంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని సీతక్క పేర్కొన్నారు.