Konda Surekha on Temple Lands : దేవాలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు కాదని విలువలు, విశ్వాసాలు, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే సంపద అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణను అంతఃకరణ శుద్ధితో చేయాలని అధికారులను కోరారు. ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కొండా సురేఖ ఆదేశించారు.
Geo Tagging for Temple Lands in Telangana : వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా సమర్థులైన న్యాయ నిపుణులను పెట్టుకోవాలని కొండా సురేఖ తెలిపారు. ఆలయ భూములు కబ్జా కాకుండా ఉండేందుకు సుమారు 15,000ల ఎకరాలు జియో ట్యాగింగ్ చేసినట్లు అధికారులు ఆమెకు వివరించారు. దేవాదాయ శాఖకు చెందిన అన్ని రకాల భూములకు వీలైనంత త్వరగా జియో ట్యాగింగ్ పనులు పూర్తి చేయాలన్న మంత్రి, ధరణిలో నమోదు చేసి దేవాలయం పేరిట పాస్‌బుక్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దేవాలయాల్లో కనీస సదుపాయాలు ఉండాలి : దేవాలయాల్లో కనీస సదుపాయాల కల్పనకు నిరంతర చర్యలు ఉండాలని కొండా సురేఖ స్పష్టం చేశారు. తాగునీరు, టాయిలెట్లు, భక్తులు సేదతీరేందుకు సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రసాదం అమ్మకాలకు వాడే ప్లాస్టిక్ కవర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. పచ్చదనం వెల్లివిరిసేలా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని వివరించారు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు సెక్యూరిటీ సిబ్బందిని, మెటల్ డిటెక్టర్స్, వాకీటాకీలు వంటి సామాగ్రిని తప్పకుండా సమకూర్చుకోవాలని కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాలన్నీ నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని సూచించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. గుడుల స్థల పురాణం, ప్రాశస్త్యం తదితర వివరాలతో తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కొండా సురేఖ ఆదేశాలిచ్చారు.
టెండర్లలో పారదర్శకత ఉండేలా మార్గదర్శకాలు : ఆలయ వివరాలను తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ను రూపొందించనున్నట్లు అధికారులు కొండా సురేఖకు తెలిపారు. సీఎస్ఆర్ నిధుల సేకరణకు ప్రత్యేకమైన పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. దేవదాయ శాఖలో టెండర్లలో అత్యంత పారదర్శక ఉండేలా మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, ఇతర వస్తువులను మార్కెట్ ధరలకు మించి అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అది నిజమని తేలితే వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపడతామని కొండా సురేఖ అధికారులను హెచ్చరించారు.
ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాల సందర్భంగా మౌలిక సదుపాయాలను నిర్ణీత కాలవ్యవధిలో మెరుగుపరచాలని కొండా సురేఖ వివరించారు. నదీ తీరాల్లో కొలువైన దేవాలయాల్లో జలహారతి, శంఖనాదం వంటి ఆధ్యాత్మిక శోభను పెంచే కార్యక్రమాలను చేపట్టాలని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన ఆలయాల ఈవోలు, తదితరులు పాల్గొన్నారు.