Minister Bhatti visit Khammam : ప్రభుత్వ ఉద్యోగులకు నెల వారీగా ఉండే ఈఎంఐ చెల్లింపులు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఒకటో తేదీన జీతాలు వేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti) పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో కష్టమైనప్పటికీ, వేతనాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రిపాలెం, నగరం మండలాల్లో పర్యటించిన మంత్రి భట్టి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
Dr BR Ambedkar Knowledge Centres : ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేనివారికి, పేద విద్యార్థులకు నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని, కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
Minister Bhatti on Study centers : ఆర్థిక పరిస్థితిని బాగుచేసి ఒకటో తేదీ నాడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని భట్టి కోరారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను, ఆరు గ్యారంటీల హామీల అమలులో అలసత్వం లేకుండా ఉద్యోగులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామకాలను చేపట్టడానికి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినట్లు గుర్తు చేశారు.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియమాకాలు చేపడతామని, గడిచిన మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి భట్టి వెల్లడించారు. గ్రూప్-1, డీఎస్సీ (TS DSC) తదితర ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వేశామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువతీ యువకులు హైదరాబాద్ వచ్చి రూ.లక్షలు వెచ్చిస్తున్నారన్నారు.
ఇందిరా క్రాంతి పథకం కింద డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు : భట్టి విక్రమార్క
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో అద్భుతమైన స్టూడియో నిర్మించి, నిష్ణాతులైన ఫ్యాకల్టీతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే నిరుద్యోగ యువతీ యువకులకు ఆన్లైన్ ద్వారా బోధన జరుగుతుందని తెలిపారు. కోచింగ్‌కు సంబంధించిన టైం టేబుల్ ముందుగానే ప్రకటించి, సదరు టైం టేబుల్ అనుగుణంగా తరగతులు నిర్వహిస్తామన్నారు.
"ప్రభుత్వ ఉద్యోగులకు నెల వారీగా ఉండే ఈఎంఐ చెల్లింపులు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఒకటో తేదీన జీతాలు వేస్తున్నాము. ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు, ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ పేరుతో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాము". - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
ప్రాణిహత చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్‌రావు, భట్టి మధ్య డైలాగ్ వార్