Vegetables Price Hike In Telangana : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రూ.30 ఉన్న కిలో టమాట ధర రూ.100 దాటింది. పచ్చిమిర్చి ధర రూ.120కి పైగానే పలుకుతుంది. ఆకు కూరలను సైతం కొనే పరిస్థితి లేదు. వర్షాకాలం ఆరంభమైనా రాష్ట్రంలో సరిపడా దిగుబడి లేక ఇతర జిల్లాలతో పాటు దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. దళారులు లాభాలు చూసుకుని విక్రయదారులకు అమ్ముతున్నారు. ఇక కూరగాయలు వినియోగదారుని దగ్గరకు వచ్చేసరికి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం రోజూ ప్రతి ఒక్కరు కనీసం 350 గ్రాముల కూరగాయలు తినాలి. ఈ లెక్కన హైదరాబాద్ నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయలు అవసరం. నగరంలోని అన్ని మార్కెట్లకు 2500 నుంచి 2800 టన్నుల కూరగాయలు మాత్రమే వస్తుండటంతో రేట్లు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
కూరగాయల ధరలకు రెక్కలు - 15 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం - WPI Inflation Rises
ఉత్పత్తి లేకపోవడంతో అవస్థలు : నిజామాబాద్ కూరగాయల మార్కెట్‌లో మండుతున్న ధరలను చూసి ప్రజలు జంకుతున్నారు. మారిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నెలలో ఉత్పత్తి లేక అవస్థలు తప్పడం లేదు. నెల ఆరంభం నుంచే కూరగాయలతో పాటు ఎల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వరకూ ధరలు పెరిగాయి. గతంలో నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి నిజామాబాద్‌కు కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం అక్కడ కూడా దిగుబడి తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, అమరావతి ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతున్నారు. దీంతో రవాణా, హమాలీ, ఇతర ఖర్చులు కలిపి ధరలపై ప్రభావం పడుతోంది.
"ముందు కిలోలుగా కొనేది ఇప్పుడు అరకిలో కొనుక్కొని పోతున్నాం. గల్లీలో ఉండే షాపువాళ్లు ధరలు ఇంకా పెంచి అమ్ముతున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అందరికీ బాక్సులు కట్టాలి అంటే కూరగాయలు తప్పని సరిగా కావాల్సిందే. ఇప్పుడు కూరగాయల ధరలు అలాగే నాన్‌వెజ్ తినేవారికి ఖర్చు సమానంగా వస్తుంది." - కొనుగోలుదారులు
నెల రోజుల్లో తగ్గే అవకాశం : రాష్ట్ర జనాభాకు ప్రతి ఏడాది సుమారు 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కానీ ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడం కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నల్గొండలో రెట్టింపైన కూరగాయల ధరలు ప్రజలకు శరాఘాతంగా మారాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదని సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో క్రయ, విక్రయాలు కూడా సవాల్‌గా మారాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో మరో నెల రోజుల్లో పంట దిగుబడి పెరిగి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.