Heavy Rush At Bus MGBS : ఓట్ల పండగలో మేుము సైతం భాగస్వాములమంటూ హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏపీ వాసులు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.
Lok Sabha Elections 2024 : ఈ నేపథ్యంలో విజయావాడ, రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుసగా సెలవు దినాలు కావడంతో రద్దీ మరింత పెరిగింది. టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను అదనంగా ఆయా రూట్లలో బస్సులను నడుపుతున్నా సమయానికి దొరక్కపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. కొందరు ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నా, మరికొందరు రిజర్వేషన్లు దొరక్క బస్‌స్టేషన్‌లో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు.
Passenger Rush in Hyderabad : మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్ సంస్థల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. మామూలు రోజుల కన్నా రెట్టింపు పిండేస్తున్నారని జనం వాపోతున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినా స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకొని, తమకు నచ్చిన నేతను ఎన్నుకుంటామని పలువురు పేర్కొన్నారు.
"ఓటేసేందుకు ఇంటికి వెళ్తున్నాను. బస్సుల కోసం ప్రయాణికులు గంటలకొద్ది పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరిపడినన్ని బస్సులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. ప్రైవేట్ బస్సులైతే ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం. ఎన్ని ఇబ్బందులు పడినా స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకొని, మాకు నచ్చిన నేతను ఎన్నుకుంటాం." - ప్రయాణీకులు
మరోవైపు పోలింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు భారీగా వెళ్తుండడంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. వరుసగా సెలవు రావడంతో కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలివెళ్తున్నారు.