Mega Drip Irrigation Works Stopped: అనంతపురం జిల్లా పేరు చెప్పగానే కరవు కళ్లముందు కదులుతుంది. సాగునీటి కోసం రైతుల పడే కష్టాలు గుర్తుకువస్తాయి. ఏ ప్రభుత్వమైనా దుర్భిక్షాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ జగన్ సర్కార్ మాత్రం అన్నదాతలు ఏమైపోతే మాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తోంది. 50 వేల ఎకరాలకు నీళ్లివ్వాలనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన మెగా డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని అటకెక్కించింది.
అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద కోట్ల రూపాయల విలువైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను నిల్వచేశారు. సీఎం జగన్ అసమర్థ, కక్షసాధింపు ప్రభుత్వ పనితీరుతో, కరవు నేలలో జలధారలు పారించాల్సిన సామగ్రి నాలుగున్నరేళ్లుగా పనికిరాకుండా పడి ఉంది. దీనివల్ల రైతన్నలు సాగనీటి కష్టాలను ఎదుర్కొంటునే ఉన్నారు.
అనంతపురం జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన ఉరవకొండలో పంటల సాగుకు గత టీడీపీ ప్రభుత్వం మెగా డ్రిప్ పథకాన్ని చేపట్టింది. 13వేల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలో తొలిసారిగా సామూహిక డ్రిప్ పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో హంద్రీనీవా నుంచి 1.67 టీఎంసీల నీటిని వినియోగించుకుని, డ్రిప్ ద్వారా 50 వేల ఎకరాలకు అందించే లక్ష్యంతో 842 కోట్లు విడుదల చేసింది.
సుమారు 25వేల ఎకరాలకు సరిపడా డ్రిప్ పరికరాలు పంపులు కొనుగోలు చేశారు. 2017లో పనులు ప్రారంభమై 2019 వరకు 40 శాతం పూర్తయ్యాయి. ఈ లోపు 2019లో సార్వత్రిక ఎన్నికలు రావటం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదికారంలోకి రావడంతో మెగా డ్రిప్ పథకానికి గ్రహణం పట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రమంతటా అన్ని పనులు నిలిచిపోయినట్లుగానే ఉరవకొండలో డ్రిప్ పథకం అటకెక్కింది.
నాలుగున్నరేళ్ల క్రితం నిలిచిపోయిన పనులు ఇప్పటికీ మొదలు కాక రైతుల పొలాల్లో అమర్చిన డ్రిప్ పైపులు దొంగల పాలవుతున్నాయి. కొనుగోలు చేసిన సామగ్రితో 25వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండకు వస్తున్న జగన్‌కు మెగా డ్రిప్ పథకం కోసం వృథాగా పడి ఉన్న పరికరాలు స్వాగతం పలుకుతున్నాయి.
"ఇప్పటికీ దాదాపుగా నాలుగు సంవత్సరాల 8 నెలలు అవుతోంది. ఆ పైపులను రైతులకు ఇచ్చింది లేదు. ఏం చేసింది లేదు. రైతులపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి ఉదాహరణల వల్లే తెలుస్తోంది." -రైతు, ఉరవకొండ
"అధికారంలోకి రాగానే దగ్గరుండి డ్రిప్ పనులు చేస్తానని జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటింది. డ్రిప్ పనులకు అతీగతి లేదు." -రైతు, ఉరవకొండ