Nagababu will Take Place In AP Cabinet : ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో చురుగ్గా నడుచుకుంటున్న నాగబాబు ప్రస్తుతం ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే అంశంపై ఇంకా ఎలాంటి ప్రకటన అధికారికంగా వెలువడలేదు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏపీలో 25 మంత్రి పదవులకు అవకాశముంది. కానీ ప్రస్తుతం 24 మంది మాత్రమే కేబినెట్లో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ప్రస్తుతం పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా పని చేస్తున్నారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి 4, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానాన్ని జనసేన పార్టీయే భర్తీ చేయాల్సి ఉంది.
ఏకగ్రీవమే : ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. మరోవైపు రాజ్యసభ అభ్యర్థిగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది. తాజాగా తెలుగు దేశం పార్టీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఈ ముగ్గురు కూటమి అభ్యర్థులు మంగళవారం (డిసెంబర్ 10న) నామినేషన్ వేయనున్నారు. ముగ్గురూ కూటమి అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.
పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని వార్నింగ్ - పేషీకి వచ్చిన ఫోన్ కాల్స్