Medaram Sammakka Sarakka Jatara 2024 : ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన వనదేవతలకు రెండేళ్లకోసారి మాఘ మాసంలో జాతర జరుగుతుంది. ఈనెల 21 నుంచి 24 వరకూ జరగనున్న జాతరకు రూ. 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి సీతక్క అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వనదేవతలు గద్దెలపై ఆగమనానికి నెల రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. బంగారంగా కొలిచే బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Sammakka Sarakka Jatara 2024 : భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగు నీటితో కళకళలాడుతోంది. ఈనెల 14న అధికారులు లక్నవరం సరస్సు(Laknavaram Lake) తూములు తెరిచి సద్ది మడుగు చెరువుకు నీటిని వదిలారు. 17న సాయంత్రం సద్దిమడుగు చెరువుతూములు తెరవడంతో దయ్యాల వాగు మీదుగా ముట్లగూడెం గ్రామాల సమీపంలోని జంపన్న వాగులోకి ప్రవహిస్తూ మేడారం వద్దకు నీళ్లు చేరాయి. నాలుగు చెక్ డ్యామ్‌లలో నీరు నిండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో స్నానాలు చేస్తున్న భక్తులు, వనదేవతల్ని దర్శించుకుంటున్నారు.
మేడారం జాతరకు 30 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ సహా పూర్తి వివరాలు ఇవే
'మేడారం సమక్క సారక్క జాతరకు మేము ప్రతిసారి వస్తాం. ఇది ఆరోసారి మేము ఇక్కడికి రావడం . తల్లిని దర్శించుకోవడం మా భాగ్యం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేసి, సమక్క గద్దెల వద్ద ఎత్తు బంగారం సమర్పించుకుంటాం. మా కోరికలను మన్నించి నెరవేర్చే ఆ తల్లికి ఒడి బియ్యం సమర్పిస్తాం. జంపన్న వాగులో ఇన్నిరోజులు నీళ్లు లేవని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు చాలా నీళ్లు వచ్చాయి. ఇక్కడ ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరికీ ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు' - భక్తులు
TSRTC Special Buses for Medaram Jatara : మేడారం జాతరకు ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25 వరకు 8 రోజులపాటు 6 వేల ప్రత్యేక బస్సులు ఆర్టీసి నడుపుతోందన్నారు. గతంలో నడిపిన దానికన్నా ఈసారి అదనంగా బస్సులు జాతరకు వెళ్తుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులకు కొంత బస్సులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అసౌకర్యానికి గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు.
'సమక్క సారలమ్మ మహా జాతరకు ఇరిగేషన్ తరఫున మాకు 6 కోట్లు 11 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ పనులన్నీ 15వ తేదీలోపు పూర్తి అయ్యాయి. ఇరిగేషన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాం. మరో రెండ్రోజుల్లో మహా జాతర ప్రారంభం కానుండటంతో లక్షల మంది వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారు. ' - సదయ్య, ములుగు ఇరిగేషన్ డీఈ
మేడారం జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ - ముందస్తు మొక్కులు సమర్పణ ముమ్మరం
మేడారం మహా జాతరకు సిద్ధమైన ఆర్టీసీ - ఈసారి 6 వేల బస్సుల ఏర్పాటు