Police Focus On Traffic Rules Violations : రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు తెలంగాణ రవాణాశాఖ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో 70వేల పైచిలుకు పైగా వాహనదారుల లైసెన్సులను రవాణాశాఖ రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సుల్లో మందుబాబులవే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు : రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కొన్నిసార్లు మనం సరైన మార్గంలో వెళ్తున్నా అవతలి వారి నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది. ఇలా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై రవాణాశాఖ దృష్టిసారించింది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గడిచిన నాలుగేళ్లలో దాదాపు 70 వేల పైచిలుకు వాహనదారుల లైసెన్సులను రవాణాశాఖ సస్పెండ్ చేసింది. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 10వేల 113 లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన వాటిలో దాదాపు 85శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదైన కేసులే ఉన్నట్లు రవాణాశాఖాధికారులు తెలిపారు.
అలా చేస్తే లైసెన్స్ సస్పెండ్ : ఇష్టారాజ్యంగా వ్యవహరించే వాహనదారులపై రవాణశాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు డేటా బేస్‌ను మరింత ఆధునీకరించాలని ఆలోచన చేస్తోంది. కేసులు ఎక్కడ నమోదైనా లైసెన్స్ అందజేసిన రవాణాశాఖ అధికారులకే సస్పెన్షన్ అధికారం ఉంది. ఈ చిక్కుముడి వీడితేనే సస్పెన్షన్‌లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుందని పోలీస్‌శాఖ అభిప్రాయపడుతోంది. ఒకే వ్యక్తి మూడు సార్లు మద్యం మత్తులో వాహనం నడిపినట్లు కేసు నమోదైనా, అధిక వేగంతో నడిపినట్లు కేసు నమోదైనా వాహనాదారుని లైసెన్సును సస్పెండ్ చేస్తారు. వాహనదారుని వివరాలు తనిఖీ చేసే అధికారులుకు తెలిసేలా డేటాబేస్‌ను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తనిఖీ అధికారుల నుంచి వాహనదారుని వివరాలు రవాణాశాఖ కార్యాలయానికి చేరితే సస్పెన్షన్ ప్రక్రియను మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
వీడెవడండీ బాబు - బైక్ ఆపిన ట్రాఫిక్ పోలీస్ బాడీ కెమెరానే కొట్టేశాడు!