Marijuana Intoxication in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో మత్తు ముంచెస్తోంది. రోజురోజుకూ గంజాయి వాడకం పెరిగిపోతుంది. నగరంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేస్తోంది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా మత్తుగాళ్ల సంఖ్య పైకి పాకుతుంది తప్ప, కిందకు దిగడం లేదు. ఇప్పుడిదే నగరవాసులకు, శివారు ప్రాంతాల వారికీ, పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు మత్తులో ఉన్నవాళ్లే రోడ్లపై గొడవలు పడుతూ, వారికి మత్తు తలకెక్కిపోతే హత్యలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. నగరంలో ఏ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయో ఒకసారి చూద్దాం.
నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న గంజాయి బ్యాచ్‌లు :
- బాగ్‌లింగంపల్లిలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు పాత నేరస్తులు పాన్ దుకాణంలోకి వెళ్లి మరీ గొడవపడ్డారు. పాన్ దుకాణం యజమానిపై మత్తులో దాడి చేశారు.
- బోలక్‌పూర్‌లో ఇద్దరు యువకులు మత్తు పదార్థం తీసుకొని నానా హంగామా సృష్టించారు. అక్కడ ఉన్నవారితో గొడవపడ్డారు.
- తాజాగా ముషీరాబాద్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని గంజాయి మైకంలో జోగుతూ వెళుతున్న యువకుడు కత్తితో పొడవటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- నగరంలోని కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగమే చేశారు. తమ ఇంటి ముందు నుంచి వెళ్లిపోవాలని అడిగిన వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఇలా నగరంలో చోటుచేసుకున్న ఘటనల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో నిత్యం ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. ఇలాంటి ముఠాలపై కళ్లెం వేయడం పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. నగరంలో గంజాయి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తూ వందల కేజీల గంజాయిని సీజ్ చేస్తున్న అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
గంజాయి సరఫరా బ్యాచ్‌లు :
- ఏపీ, ఏవోబీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు 100 కిలోల గంజాయి వివిధ మార్గాల్లో చేరుతున్నట్లు పోలీసుల అంచనా. ముఖ్యంగా గంజాయి దందా దూల్పేట్, మంగళ్‌హాట్ అడ్డాగా సాగుతుంది. ఇలాంటి అడ్డాల్లో అడ్డుకట్టి వేసేందుకు అబ్కారీ, పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయిలో సానుకూల ఫలితాలు రావడం లేదనే చెప్పాలి.
- ఈనెలలోనే నగరంలో నాలుగు చోట్ల గొడవలు, 10కి పైగా రోడ్డు ప్రమాదాలు, రెండు హత్యలు గంజాయి మత్తు వల్లే జరిగాయని పోలీసులు నిర్ధారించారు.
- రాష్ట్రంలో సుమారు 40 వేల మంది డ్రగ్స్ బానిసలు ఉన్నట్లు టీజీన్యాబ్ చెప్పింది. వీరిలో 25 వేల మంది మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉన్నట్లు అంచనా.
ఖాళీ జాగాలే అడ్డాలు :
- గంజాయి మత్తుకు దగ్గరైన వారిలో చాలామందిని కుటుంబాలు దూరంగా నెట్టేశాయి. వీరంతా రైల్వేస్టేషన్లు, మెట్రో పిల్లర్లు, శ్మశానాలు, పార్కులు, పబ్లిక్‌గార్డెన్, బస్టాండులలో మకాం వేస్తున్నారు.
- ముషీరాబాద్, చిక్కడపల్లి, గాంధీనగర్ పరిధిల్లో అయితే రేయింబవళ్లు గంజాయిని పీల్చుతూ పది సంఖ్యలో ముఠాలు దారంట వెళ్లే వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి వారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా పరిస్థితిలో మార్పు అసలు కనిపించలేదు.
- గంజాయి సరఫరాకు ముఖ్యంగా కుటుంబానికి దూరంగా ఉంటూ కూలీ చేసుకుంటూ విభాగినులు, పాదచారి మార్గాల్లో ఉండే యువకులను మత్తు ముఠాలు ఏజెంట్లుగా మార్చుకుని దందాను సాగిస్తున్నారు.
- అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ఈ ముఠాలు గంజాయి ప్యాకెట్లను ఇలాంటివారికిచ్చి కొనుగోలుదారులకు చేరవేస్తున్నారు. కమీషన్ కింద రూ.200-300 డబ్బు, 5 గ్రాముల గంజాయిని అదనంగా ఇస్తున్నారు.