ETV Bharat / state

కోడళ్లు అనుకోలేదు.. కూతుళ్లుగానే భావించారు - రామోజీరావు కోడలు శైలజా కిరణ్‌ - SAILAJA KIRAN ABOUT RAMOJI RAO

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 8:07 AM IST

Updated : Jun 20, 2024, 8:40 AM IST

Margadarshi MD Shailaja Kiran Shared Memories of Ramoji Rao : కోడళ్లు అనుకోలేదు.. కూతుళ్లుగానే భావించారు. అందుకే వ్యాపార బాధ్యతలతో పాటు తాను నమ్మిన విలువలనీ కొనసాగించే బాధ్యతను వారసత్వంగా అందించారు రామోజీరావు. వాళ్లూ వాటిని అంతే సమర్థంగా నిర్వహిస్తూ అగ్రగామిగా నిలబెడుతున్నారు. మార్గదర్శి సారథిగా, ఇంటికి పెద్ద కోడలిగా మామగారి గురించిన జ్ఞాపకాలను ‘వసుంధర’తో పంచుకున్నారు శైలజా కిరణ్‌.

Margadarshi MD Shailaja Kiran Shared Memories of her Father in Law Ramoji Rao
Margadarshi MD Shailaja Kiran Shared Memories of her Father in Law Ramoji Rao (ETV Bharat)

Margadarshi MD Shailaja Kiran Shared Memories of her Father in Law Ramoji Rao : ‘శైలజమ్మా..’ అంటూ ఆప్యాయంగా పిలిచే మావయ్యగారి గురించి ఏమని చెప్పను? ఎంతని చెప్పను? తెల్లటి దుస్తులు, సూటిగా చూసే కళ్లు, మూర్తీభవించిన విగ్రహం. మొదటిసారి ఆయన్ని చూడగానే విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం అనుకున్నా. అలా మా పెళ్లిచూపుల్లో మొదటిసారి ఆయన్ని చూశా. ఆ రూపం ఇప్పటికీ నాకు గుర్తుంది. అసలు మా పెళ్లి చిత్రంగా జరిగింది. చాలామంది కిరణ్‌గారూ, నేనూ క్లాస్‌మేట్స్‌ అనుకుంటారు. కానీ కాదు. నేను చదివిన కోయంబత్తూరు కాలేజ్‌లో ఆయన నాకు సీనియర్‌. నేను వెళ్లేసరికే ఆయన చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. నేను చేరిన మొదటి ఏడాదే మా ప్రొఫెసర్‌ సంతానలక్ష్మిగారు ‘ఈనాడు సంస్థ వాళ్లు మంచి అమ్మాయి ఉంటే చెప్పమని అడిగారు. నీ పేరు చెప్పా’ అన్నారు. అయితే కిరణ్‌గారు వాళ్లమ్మగారితో టైమ్‌ కావాలని అనడంతో ఆ ప్రస్తావన అక్కడితో ఆగిపోయింది.

నిజానికి నేను చెన్నైలో చదువుకోవడంవల్ల నాక్కూడా ఈనాడు పత్రిక పేరు వినడమేగానీ రామోజీరావుగారి గురించి పెద్దగా తెలియదు. ఎంబీఏ పూర్తయి ఇంటికొచ్చాక తిరుపతి మేనేజరుగారు మా ఇంటికి వచ్చి మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నాన్నగారూ సరే అనడంతో నన్ను చూడ్డానికి కిరణ్‌గారూ మావయ్యగారూ కుటుంబంతో కలిసి వచ్చారు. అందరిలానే ఆయన నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. ‘నాకు వర్క్‌ చేయడం ఇష్టం’ అని చెప్పా. తరవాత రెండు రోజులకి మావయ్యగారు ఇంటికి ఫోన్‌ చేసి ‘మాకిష్టమేనమ్మా.. నీకిష్టమేనా?’ అని అడిగారు. వెంటనే నేను ‘మీ ఇంటికి కోడలుగా రావడం వరంగా భావిస్తున్నా’ అన్నా. పెళ్లయ్యి వచ్చాక కూడా కొత్తలో ఆయనంటే కాస్త భయం ఉండేది. అత్తమ్మ సౌమ్యంగా ఉండేవారు.

మావయ్య చాలా బిజీగా, ఎప్పుడూ చదువుతూ ఉండేవారు. ఆయన ఏం అడుగుతారో, ఏం చెప్పాలో రిహార్సల్‌ వేసుకుని మరీ ఆయన దగ్గరకు వెళ్లేవాళ్లం. అయినా కొన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానం ఉండేది కాదు. మా కోడళ్లిద్దరినీ శైలజమ్మా, విజయమ్మా అంటూ ప్రేమగా పిలిచేవారు. దాంతో మా భయం తగ్గింది. మా కుటుంబం అనే కాదు, ఆయనకు ఇద్దరు అక్కలు. మేనకోడళ్లూ, మేనల్లుళ్లన్నా ఎంతో అభిమానం, ప్రేమ. అత్తమ్మ తరపు బంధువుల్నీ అంతే ప్రేమించేవారు. పెళ్లయిన కొత్తలో అందరినీ చూపించి ‘మన కుటుంబం’ అని చెప్పేవారు.

నిజానికి ఆయన పైకి గంభీరంగా ఉన్నా చాలా సెన్సిటివ్‌. మాకు తొలిసారి బాబు పుట్టి చనిపోయాడు. అప్పుడు ఆయన మద్రాస్‌ హాస్పిటల్‌కు వచ్చారు. ఆ బాబుని చూసి కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్నారు. అలా ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. బాబు మరణం మమ్మల్ని అందరినీ ఎంతో బాధించింది. తరవాత సుమన్‌ మరణం. ఈ రెండూ మా కుటుంబానికి తీరని లోటు. ఆయన్నీ తీవ్రంగా కదిలించాయి.

ఇంట్లో సరదాగా! : మావయ్య పనిలో బిజీగా ఉండటంతో అత్తమ్మే అన్నీ చూసుకునేవారు. మా ఇంట్లో ప్రతీదీ టైమ్‌ ప్రకారం జరగాలి. సంస్థల్లో మాదిరిగానే ఇంట్లోనూ సమయానికి అన్ని పనులూ అయ్యేలా వ్యవస్థ ఉంటుంది. ఛైర్మన్‌గారు ఉదయాన్నే భోజనం చేసి వెళ్లిపోయేవారు. మధ్యాహ్నం స్నాక్స్, రాత్రికి పండ్లు మాత్రమే తీసుకునేవారు. మావయ్యగారికి పెసరట్టు అంటే ఇష్టం. ఆదివారం ఎవరినీ కలవడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఈ ఒక్కరోజైనా షేవ్‌ చేసుకోనక్కర్లేకుండా హాయిగా పంచెలో ఉండొచ్చు కదా అనుకునేవారు.

పైగా ఆరోజు ఇంకా ఎక్కువగా చదువుకునేవారు. నా పెళ్లయిన కొత్తల్లో ఆదివారం సాయంత్రం దూరదర్శన్‌లో ఏ సినిమా వచ్చినా చూసేవారు. ఇదొక్కటే కదా నాకు వినోదం, విరామం అని నవ్వేవారు. ప్రతి ఆదివారం లంచ్‌ అందరం కలిసి చేసేవాళ్లం. పండుగలమీద ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి లేకపోయినా, మమ్మల్ని వద్దనేవారు కాదు. ఫిల్మ్‌సిటీకి వచ్చాక దీపావళి వస్తే మనవరాళ్లూ అంతా ఒకచోట టపాసులు కాలుస్తుంటే ఇష్టంగా చూసేవారు.

విశేషాధికారం : పెళ్లి అనేది మావయ్య దృష్టిలో ఎంతో విలువైనది. ఇద్దరికీ అర్థం చేసుకునే మనసు ఉండాలి. అప్పుడే అది కలకాలం ఉంటుందని తరచూ చెప్పేవారు. అవన్నీ వింటూ పెరగడం వల్లేనేమో మా నలుగురు అమ్మాయిలూ అబ్బాయీ కూడా ఎంతో పద్ధతిగా పెరిగారు. ఒకరకంగా చెప్పాలంటే మాకన్నా వాళ్లంటేనే మావయ్యగారికి ఎంతో ప్రేమ. దానికో కారణముంది. చిన్నతనంలో ఆయన వాళ్ల తాతగారి దగ్గరకు వెళితే ఆయన నిత్యం భక్తి భావనలో ఉంటూ చిన్న నామం పెట్టి పంపేసేవారట. దాంతో తాతతో సరదాగా ఆడుకోవాలి, కబుర్లు చెప్పాలి అన్న కోరిక తీరలేదు.

అది తన మనవడూ మనవరాళ్లూ మిస్సవ్వకూడదు అనుకునేవారు. అందుకే వాళ్లేం చేసినా ఊరుకునేవారు. అందులోనూ మా పెద్దమ్మాయి సహరి అంటే మరీనూ. ఆయన మీదెక్కి ఆడుకునేది. ఎగిరి దూకేది. ఓరోజు అందరం భోజనం చేస్తుండగా ఆయన పక్కన పెట్టిన వాచీ తీసి తలమీద పెట్టింది. అది చూసి నేను భయంతో చూస్తుంటే మావయ్యగారు నవ్వేసి, దాన్ని చేతికి పెట్టుకున్నారు. ఇది తాతమీద మనవలకు మాత్రమే ఉండే విశేషాధికారం అనేవారు. అలాగే పిల్లల్ని మార్కులకోసం ఇబ్బంది పెట్టొద్దు. జీవితమే పాఠాలు నేర్పిస్తుంది. మధ్య తరగతి వాళ్లు చదివే స్కూళ్లూ కాలేజీల్లో చదివితేనే వాళ్లకు అన్నీ తెలుస్తాయి అనేవారు. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం అని తరచూ చెప్పేవారు.

ప్రజల కోసం : చేసే వ్యాపారమేదైనా దానిలో సమాజహితం ఉందా అని చూసేవారు. అలాంటిది మార్గదర్శిపై ఏడాదిన్నరలో 12 కేసులు పెట్టారు. అప్పుడూ మావయ్య చెప్పిందొక్కటే ‘శైలజమ్మా 5 కోట్లమందికి జరిగే హాని ముందు మన నష్టమెంత? దీన్ని ఇబ్బందిగా కాదు. సానుకూలంగా నీకొచ్చిన అవకాశంగా తీసుకో. నిజమే అకారణంగా, రాకూడని కష్టం వచ్చింది. ధైర్యంగా ఎదుర్కో. తప్పు చేయలేదు కాబట్టి, ఆ ధైర్యం నీకు మరింత పెరుగుతుంది’ అన్నారు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యోగులు, వినియోగదారులు అండగా నిలబడ్డారని వాళ్లకి స్వయంగా ధన్యవాదాలు చెప్పారు కూడా.

విమర్శలు ఆయనకు కొత్త కాదు. సద్విమర్శను స్వీకరిస్తారు. కావాలని చేసే విమర్శలనీ చదివేవారు. అబద్ధాలను చదవడం ఎందుకండీ అని నేనంటే ‘వాటినీ చదవాలి. కానీ పట్టించుకోకూడదు’ అనేవారు. ఎంత విషం చిమ్మినా ఛైర్మన్‌గారు ఎవరినీ ద్వేషించరు. పైగా ‘పాపం వాళ్లు ఎమోషనల్లీ హ్యాండీక్యాప్‌డ్‌’ అనేవారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు తరఫున వారికి అండగా నిలవాలి అనేవారు. నిర్మాణాత్మకంగా, ప్రజలకు మేలు చేసేలా వ్యవస్థలు ఉండాలని కోరుకునేవారు. అవే నిర్వీర్యమవుతోంటే తట్టుకోలేకపోయారు. ప్రజలే నన్నింతటివాడిని చేశారు. వాళ్లవల్లే బాధ్యతాయుత స్థానంలో ఉన్నా. వాళ్లకి కృతజ్ఞత చూపించాలి, వారిలో మార్పు తీసుకురావాలనేవారు.

చావంటే భయం లేదు : ఓసారి శైలజమ్మా ‘స్మృతివనం’ చూసిరా అన్నారు. నేను వెళ్లనంటే ‘ఎవరైనా ఎప్పటికైనా అక్కడకు వెళ్లాల్సిందే’ అనేవారు. చావు గురించి ధైర్యంగా చర్చించేవారు. 80 దాటాక ప్రతిరోజూ తనకి బోనస్‌ అనేవారు. చిన్నమ్మాయిని కాలేజీలో చేర్చాక మావయ్యతో గడపాలి అనుకున్నాం. కానీ ఇంతలో ఇలాగైంది. ఆయన మాతో లేకపోవడం పెద్ద లోటే. కానీ ఆ దిగులుతో ఆగిపోం. ఆయన సూచనలు, నేర్పిన క్రమశిక్షణ మా నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. నాకు తొలిసంతానం మార్గదర్శే! ఆ తరవాతే కడుపున పుట్టినవాళ్లు. మామయ్యగారు కోరుకున్నట్లుగా సంస్థలను బాగా నడుపుతూ, వేలమందికి ఉపాధి కల్పించడం దిశగానే మేము, మా తరవాతి తరాలు, ఉద్యోగులు అందరం కలిసి పనిచేస్తాం.

"మా అత్తగారు ఛైర్మన్‌ గారికి తగిన ఇల్లాలు. నిండుకుండలాంటి మనస్తత్వం. పిల్లలే లోకం. దేనికీ తొందరపడరు. ఛైర్మన్‌గారితో కలిసి ఓసారి రైల్లో అనంతపురం వెళ్తున్నాం. భోజనం పూర్తయ్యాక ఆయన తాగిన మంచినీళ్ల గ్లాసు కడగడానికి వెళ్తుంటే.. నాకివ్వండి అన్నా. ఆయన ససేమిరా అన్నారు. ఎవరితోనూ పని చేయించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్‌ ఇచ్చినా, వాళ్లకి ఏదో రూపంలో తిరిగి ఇవ్వాలనే చూసేవారు. డాక్టర్ల విషయంలోనూ అంతే. ఎంత వినయంగా థాంక్యూ చెప్పేవారో! కొవిడ్‌ సమయంలో ఏమీ తోచక యూట్యూబ్‌లో చూసి నేనే వంట చేశాను. నువ్వు తినేలా చేసినా.. నాకు తినే వయసు దాటిపోయిందన్నారు. అత్తగారు మాత్రం రుచిచూసి మెచ్చుకున్నారు."

మార్గదర్శి ప్రయాణం :పెళ్లైన ఆరునెలలకి మామయ్యగారే స్వయంగా మార్గదర్శి బ్రాంచికి తీసుకెళ్లి మేనేజర్‌కి అప్పగించారు. ‘అమ్మాయి చాలా తెలివైంది. ప్రతి విషయం క్షుణ్ణంగా నేర్పించ’మన్నారు. వెళ్లేముందు ఆయన నాకు చెప్పిందొక్కటే! ‘మార్గదర్శికి ఇప్పటికి 28 ఏళ్లు. అంటే నీ వయసంత అనుభవం ఉన్న ఉద్యోగులుంటారు. నువ్వే సర్దుకుపోవాలి’ అన్నారు. దాంతో ప్రతి ఉద్యోగితో మర్యాదగా ఉండేదాన్ని. వాళ్లూ ‘మన సంస్థ’ అనుకొనే పనిచేస్తారు. మేం బేగంపేటలో ఉన్నప్పుడు మామయ్య తెల్లవారుజామున 4.30కి వాకింగ్‌ చేసేవారు. సరిగా అప్పుడే నేను ఇతర ప్రాంతాల్లోని మార్గదర్శి యూనిట్లకు పర్యటనలకు వెళ్తుండేదాన్ని. అది చూసి ‘బాగా కష్టపడుతోంది’ అని స్నేహితులతో చెప్పేవారట. 30 ఏళ్లుగా సంస్థ బాధ్యతలన్నీ పూర్తిగా నేనే చూస్తున్నా. నా పనివల్ల ‘ఛైర్మన్‌ గారికి’ అప్రతిష్ఠ రావొద్దన్న భయంతో పనిచేస్తా.

సీనియర్‌ సభ్యులు, ఉద్యోగులు తోడు నిలిచారు. నిరంతర మానిటరింగ్, చెకింగ్‌లతో నిర్విరామంగా పనిచేశాం. లక్షలమందికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ. వినియోగదారులకు జవాబుదారీగా ఉండాలనుకున్నాం. కొవిడ్‌లోనూ ఈ నియమం తప్పలేదు. ఏటా రెండుసార్లు మామయ్యగారికి ప్రెజెంటేషన్లు చూపించేదాన్ని. కొత్త ఆలోచన చూపిన ప్రతిసారీ.. ‘అన్నం ఉడికిందనడానికి ఒక్క మెతుకు చాలు. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు’ అనేవారు. భవిష్యత్‌ తరాలకు సాయపడేలా మార్గదర్శిలో ఏఐ ఎనేబుల్డ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ తీసుకొస్తున్నాం. దాన్ని మావయ్యకి చూపిస్తే మెచ్చుకోవడమే కాదు ‘శైలజమ్మా.. నీ శ్రమతో మార్గదర్శిని మంచి స్థాయికి తీసుకెళ్లావ్‌’ అన్నప్పుడు చాలా ఆనందించా. ఓ కోడలిగా అంతకన్నా నాకు ఇంకేం కావాలి.

ధర్మం ఊరికే గెలవదు - దాన్ని రక్షించడానికి చాలామంది పోరాడాలని చెప్పేవారు తాతయ్య: రామోజీరావు మనవరాలు దివిజ - RAMOJI RAO Grand Daughter Interview

తాతయ్య చిన్న ప్రశంస ఏళ్ల పాటు ఇంధనంలా పని చేస్తుంది : రామోజీరావు మనవరాలు బృహతి - RAMOJI RAO Grand Daughter Interview

Last Updated : Jun 20, 2024, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.