Narsampet Registration Office : వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలావస్థకు చేరి సమస్యలకు నిలయంగా మారింది. పట్టణంలోని నడిబొడ్డులో తహసీల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. నర్సంపేట రెవెన్యూ పరిధిలో గల 18 గ్రామాలకు చెందిన 76వేల 635మంది ప్రజల అవసరాలను తీర్చుతుంది. 40 ఏళ్ల కిత్రం నిర్మించిన ఈ కార్యాలయం పూర్తిగా శిథిలమై కూలిపోయే దుస్థితికి వచ్చింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి భవనం తడిసి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి.
రికార్డులు పూర్తిగా ధ్వంసం : సదరు కార్యాలయంలో రికార్డుల రూములో నిల్వఉన్న పత్రాలపై వాననీళ్లు పడకుండా టార్పిలిన్ పరదాలు కప్పి ఉంచారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అవి తడిస్తే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన రికార్డులు పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. అదేవిధంగా ఎప్పుడో నిర్మించిన భవనం కావడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం పొంచి ఉందని పలువురు వాపోతున్నారు. విద్యుత్ ఎర్త్ వచ్చి కంప్యూటర్లు పనిచేడంలేదని వాపోతున్నారు.
ప్రత్యామ్నాయం చూపాలి : విలువైన భూ క్రయవిక్రయాలకు తలమానికంగా మారిన కార్యాలయానికి వచ్చేందుకు అధికారులు, సిబ్బంది జంకుతున్నారు. తాత్కాలికంగా ఈ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చి దీన్ని కూలగొట్టి నూతన భవన సముదాయాన్ని నిర్మించి రెవెన్యూ పరిధిలోని ప్రజల అవసరాలు తీర్చాలని స్థానికులు, అధికారులు కోరుతున్నారు. కార్యాలయం పరిస్థితిపై నర్సంపేట మున్సిపాలిటీవారి దృష్ఠికి తీసుకెళ్లగా, భవనాన్ని తొందరగా ఖాళీచేయాలని చెప్పారని తెలిపారన్నారు. ప్రత్యామ్నాయంగా అద్దె భవనం చూపించడం లేదన్నారు.
పట్టణ పరిధిలో కార్యాలయ నిర్వహణకు సరిపడా భవన సముదాయం లభ్యం కావడంలేదని, ప్రభుత్వమే చొరవ తీసుకుని భవనాలు చూపించాలని అధికారులు కోరుకుంటున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం స్పందించి చర్యలు చేపట్టాలని కార్యాలయానికి వచ్చేపోయే వారు అభిప్రాయపడుతున్నారు. కానీ పట్టణ పరిధిలో కార్యాలయ నిర్వహణకు సరిపడా భవన సముదాయం లభ్యం కాకపోవడంతో ఇందులోనే బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చాలని సిబ్బంది కోరుతున్నారు.
ఈ భవనాన్ని నిర్మించి చాలా రోజులు కావడంతో కూలడానికి సిద్ధంగా ఉంది. మొత్తంగా బీటలు వారింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయంతో విధులు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ భవనాన్ని సమకూర్చాలి. - రెవెన్యూ కార్యాలయ ఉద్యోగి