Many People Received the CM Cheyootha Help Within 24 Hours : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పెద్దమనస్సు చాటుకున్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం ఇద్దరు మహిళలు అడిగిన సాయాన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 24 గంటలు గడవక ముందే వారికి సాయం అందించి అండగా నిలిచారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నిర్వహించిన పేదలకు సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. తలారి గంగమ్మ అనే మహిళ చిన్న కుమారుడు అశోక్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడు. ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ముఖ్యమంత్రిని కోరారు. వారి బాధలు విన్న ముఖ్యమంత్రి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
సభా వేదిక వద్ద సీఎం ప్రసంగించే సమయంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వెంకటరాముడికి, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాముడికి చెరో రూ.లక్ష మంజూరు చేయాలని తెలిపారు. ఆదేశాలు జారీ చేసి ఒక రోజు కూడా గడవక ముందే అశోక్‌కు రూ.3.80 లక్షల విలువ చేసే ఆటో, వెంకటరాముడు, రాముడికి సీఎం సహాయ నిధి కింద రూ.లక్ష చొప్పున కర్నూలులో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సమక్షంలో కలెక్టర్ రంజిత్‌బాషా బుధవారం అందజేశారు.
గంగమ్మకు హామీ ఇచ్చినట్లుగానే సీఎం చంద్రబాబు 24 గంటలు తిరక్కముందే వారి కుమారుడికి ఆటోను అందజేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు 3లక్షల 80 వేల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను పత్తికొండకు తీసుకువెళ్లి అశోక్ కు అందించారు.
మరో మహిళ కవిత తన భర్త రాముడికి కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో నరాల వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేస్తున్నారని ఆర్థిక సాయం చేయాలని సీఎంకు విన్నవించారు. ఆమెకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల చెక్ ను అధికారులు అందించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.