Manda Krishna On Sc Sub Classification : మాదిగలకు అన్యాయం జరిగినట్లు కోర్టులు, సమాజం, కమిషన్ నిర్ధారించాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. రిజర్వేషన్లు అందరికీ అందక అసమానతలు వచ్చాయని అన్ని కమిషన్లు ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "క్రాస్ టాక్ విత్ మంద కృష్ణమాదిగ" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
1998లో అన్ని పార్టీలు మద్దతిచ్చాయి : 1998లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం జరిగితే అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్న మందకృష్ణ మాదిగ ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. వ్యతిరేకించే కొందరు స్వార్థపరులు తప్ప అందరూ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏడుగురు న్యాయమూర్తుల బృందం అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, న్యాయం ఇవ్వడంలో జస్టిస్ చంద్రచూడ్‌ను మించిన వారు లేరని కొనియాడారు.
అందరి మద్దతు ఉండటంతోనే ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లు నిలబడిందని స్పష్టం చేశారు. హర్షకుమార్ లాంటి నేతలకు వారి కులంలోనే విలువ లేదని విమర్శించారు. ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంటులో బిల్లు పెట్టమని అంటున్నారని ఆక్షేపించారు. సోనియా, రాహుల్ అందరినీ తాను కలిశానని, బిల్లు పెట్టొద్దని అడ్డం పడ్డది ఆయనే కదా అని ధ్వజమెత్తారు. మాల మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు వల్లే మాకు మేలు జరిగింది : వర్గీకరణకు వ్యతిరేకమైతే బయటకు రావాలని మందకృష్ణ కోరారు. వారంతా ముమ్మాటికీ మనువాదులేనని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణకు సపోర్టు చేసిన వారికి తన మద్దతు ఉంటుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి గతంలో జరిగిన ఎన్నికల్లో మద్దతు ఇచ్చామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు వల్లనే తమకు మేలు జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. చట్ట సభలకు వెళ్లి గొంతెత్తాలని ఎవరికైనా ఉంటుందన్న మందకృష్ణ తాను 2004, 2009, 2014లో ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయానన్నారు.
"వర్గీకరణను వ్యతిరేకించే వారు కొంతమంది స్వార్థపరులే తప్ప యావత్ సమాజం మాదిగలకు అండగా ఉంది. గత 30 ఏళ్ల పోరాటంలో ఎమ్మార్పీఎస్‌కు సమాజం నుంచి వచ్చిన సహకారంతోనే ఇప్పటివరకు మనుగడలో ఉంది. న్యాయవ్యవస్థ, రాజకీయ పార్టీల మద్ధతు మాకు ఉంది"- మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు
Manda Krishna Comments On Kharge : ' సీఎం రేవంత్ రెడ్డిని కొంత నమ్ముతా కానీ, మల్లికార్జున ఖర్గేను నమ్మను. వర్గీకరణకు అడ్డుపడుతుంది ఆయనే' అని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోనియా, రాహుల్ ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్, కర్ణాటకలో సిద్దరామయ్య స్వాగతించారు. కానీ, ఖర్గే మాత్రం వ్యతిరేకించారని ఆయనను వదిలిపెట్టం జాతీయ స్థాయిలో చూసుకుంటామని హెచ్చరించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అటార్నీ జనరల్ ద్వారా తమకు అండగా ఉందన్నారు. ఈ తీర్పులో కేంద్రం భాగస్వామ్యం ఉందని సంతోషం వ్యక్తం చేశారు. మోదీకి మనువాదంతోపాటు మానవతా వాదం కూడా ఉందంటూ కృష్ణమాదిగ కితాబిచ్చారు.