Manchu Vishnu Comments On Prakash Raj Tweet : తిరుమల వెంకన్న స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని, అది కులమతాలకు అతీతమైన అంశమని 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు. లడ్డూ అంశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఎక్స్ వేదికగా నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే హెల్త్ హబ్ ఆధ్వర్యంలో మా అసోసియేషన్ సభ్యులకు ఏర్పాటు చేసిన మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని మంచు విష్ణు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంచు విష్ణు, సినిమా వారి జీవితం అద్దాల మేడ లాంటిదన్నారు. తిరుపతి లడ్డూ వంటి అత్యంత సున్నితమైన అంశాల్లో సినీ రంగంలోని వారు ఆచితూచి మాట్లాడతారని, అలాగే మాట్లాడాలి కూడా అని సూచించారు. ఏదైనా విషయంపై తాను మాట్లాడితే కొంతమందికి నచ్చవచ్చని, మరి కొంతమందికి నచ్చకపోవచ్చని అన్నారు. నచ్చని వాళ్లు తమను సులభంగా టార్గెట్ చేస్తారని, అందుకే నటీనటులు చాలా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడతారని వివరించారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమోనని భయంగా ఉందని వ్యాఖ్యానించారు. అలానే శ్రీవారి మహా ప్రసాదం లడ్డూకు కమ్యూనల్ రంగు అంటించటం సరికాదని ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై వ్యాఖ్యానించారు.
Tirupati Laddu Controversy : ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌ను ఉద్దేశించి మాట్లాడిన మంచు విష్ణు, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అదే విధంగా తన అభిప్రాయాన్ని తాను తెలియజేసినట్లు వివరించారు. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సరికాదని తెలియజేశా అంతే తప్ప, ఇంకేమీ లేదన్నారు. తన తండ్రి మోహన్‌బాబు నటించిన చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారని, ఎంతోకాలం నుంచి ప్రకాశ్‌రాజ్ తెలుసని తెలిపారు. తాను అంకుల్ అని పిలుస్తుంటానాన్న విష్ణు, ఆయన అంటే గౌరవం ఉందని తెలిపారు. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని మంచు విష్ణు తెలిపారు.
ప్రకాశ్‌రాజ్ అలా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan VS Prakash Raj