Man commited suicide after Killed wife and Son : హైదరాబాద్‌లో బేగంబజార్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమారుడిని హత్యచేసి అనంతరం భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య గొంతు కోసి చంపిన భర్త సిరాజ్, కుమారుడి గొంతు నులిమి హతమార్చాడు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిరాజ్(41) ఆరేళ్లుగా బేగంబజార్‌లోని ఓ బ్యాంగిల్ స్టోర్‌లో పని చేస్తున్నాడు. సిరాజ్‌కు భార్య హేలియా (35), ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యపై అనుమానంతో గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో భార్య గొంతు కోసి చంపిన సిరాజ్, చిన్న కుమారుడిని గొంతు నులిమి పాశవికంగా కడతేర్చాడు. అనంతరం అతను ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తనను క్షమించాలని హిందీలో సూసైడ్ నోట్ రాసి తన తల్లిదండ్రులను కోరాడు. తమ మృతదేహాలను స్వస్థలానికి పంపించాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉదయం 4 గంటల సమయంలో నిద్రలేచిన సిరాజ్ పెద్ద కుమారుడు, రక్తం మడుగులో ఉన్న తల్లిని గుర్తించి భవనంలో నివాసమున్న వ్యక్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
నెలరోజుల క్రితమే నగరానికి వచ్చిన సిరాజ్ కుటుంబం : నెలరోజుల క్రితమే సిరాజ్ తన కుటుంబాన్ని ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇక్కడి తీసుకువచ్చాడు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఫజియాబాద్. కాగా ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటలకు డయల్ 100 ద్వారా సమాచారం వచ్చిందని తెలిపారు.
'పోలీసులు సరిగ్గా స్పందించలేదు అందుకే నేనే చంపేశా - ఆడపిల్ల తండ్రిగా నేను చేసింది న్యాయమే'