Man killed Three Children and Commits Suicide in Hyderabad : రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలోని టంగటూర్ గ్రామానికి చెందిన నీరటి రవికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆయనకు భార్య శ్రీలతతో పాటు సాయికిరణ్, మోహిత్ కుమార్, ఉదయ్‌కిరణ్ అనే ముగ్గురు కుమారులున్నారు. తాను పని చేస్తున్న సంస్థ కోసం రవి రెండేళ్ల క్రితం ఏపీలోని గుంటూరు (Guntur) ప్రాంతానికి వెళ్లాడు. అక్కడే జీఎస్‌ఎన్ (GSN) ఫౌండేషన్ ప్రతినిధితో ఆయనకు పరిచయం ఏర్పడింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే, రెండు మూడు రెట్లు లాభాలు ఇప్పిస్తానని, రూ.వెయ్యి కడితే 45 రోజుల తర్వాత రూ.3 వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఆర్నెళ్లలో రూ.6 లక్షలు లాభంగా ఇస్తామని నమ్మించాడు. గొలుసుకట్టు విధానంలో మరింత మందిని చేర్పించాలని సూచించాడు.
దీనికి ఆకర్షితుడైన రవి, అప్పట్లో కొంతమేర డబ్బు పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. నమ్మకం కుదరడంతో తన దగ్గరున్న డబ్బు రూ.లక్షల్లో పెట్టాడు. ఈ క్రమంలోనే టంగటూరుతో పాటు తన పరిసర గ్రామాల్లో పరిచయం ఉన్న వారందరితో పెట్టుబడులు పెట్టించాడు. తనను నమ్మాలని, భారీగా లాభాలు వస్తాయని అందరికీ చెప్పాడు. ప్రారంభంలో పెట్టిన డబ్బులకు మించి రావడంతో అందరూ నమ్మి పెట్టుబడులు పెట్టారు. పెట్టిన డబ్బులకు ఆరంభంలో చెల్లింపులు బాగానే చేసిన జీఎస్‌ఎన్ సంస్థ, గత మూడ్నెళ్లుగా లాభాలు ఇవ్వడం లేదు. కొన్ని నెలలు డబ్బులిచ్చి, ఆ తర్వాత రాకపోవడంతో గ్రామస్థులు, సమీప బంధువులు రవిని అడగడం మొదలుపెట్టారు.
కొందరు ఇంటికి వచ్చి తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసేవారు. గ్రామస్థులతో పాటు తాను మోసపోయినట్లు గుర్తించిన రవి, డబ్బు చెల్లించలేక ఇంటికి సక్రమంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. డబ్బు చెల్లించిన వారు తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో 15 రోజుల నుంచి టంగటూర్ నుంచి వెళ్లిపోయి శంకర్‌పల్లిలో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతరుల డబ్బు ఎందుకు పెట్టుబడి పెట్టించారని ఓ వైపు భార్య శ్రీలత భర్తను నిలదీస్తూ వచ్చింది. ఇంటాబయటా ఒత్తిడి పెరిగిపోవటంతో ప్రాణాలు తీసుకోవటమే మార్గంగా రవి నిర్ణయించుకున్నాడు.
Man Dies By Suicide after Killing Three Children : ఆదివారం ఉదయం చిన్నకుమారుడు ఉదయ్‌కిరణ్‌ను వెంటబెట్టుకుని మొయినాబాద్ మండలం చిల్కూరులోని గురుకుల పాఠశాలలో 6, 5 తరగతులు చదివే కుమారులు సాయికిరణ్, మోహిత్‌కుమార్‌లను వసతిగృహం నుంచి బయటకుతీసుకొచ్చాడు. రాత్రి 8 గంటలకు భార్య శ్రీలతకు ఫోన్ చేసిన రవి, తనను పుట్టింటికి వెళ్లమని, పిల్లలు తనతో ఉంటారని చెప్పగా ఆమె సోదరుడి ఇంటికి వెళ్లింది. రాత్రి పదిన్నరకు ఫోన్‌చేసి భార్యతో మాట్లాడిన రవి, పిల్లలు నిద్రపోయాక అర్థరాత్రి వరకూ ఎదురుచూశాడు. కుమారులు నిద్రపోతున్న సమయంలో పడుకున్నచోటే తాడుతో మెడకు ఉరి బిగించాడు. వారంతా మరణించారని నిర్ధారించుకుని, సమీపంలోని తన స్థలంలో నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ దగ్గరకు వెళ్లి, రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
పెట్టుబడుల పేరుతో జీఎస్‌ఎన్ సంస్థ చేసిన మోసాలే ఘటనకు కారణమని గ్రామస్థులు వాపోతున్నారు. రెండేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన వారు 2 కోట్ల వరకూ ఆ సంస్థకు చెల్లించినట్లు తెలుస్తోంది. భారీఎత్తున డబ్బు రావడంతో గతేడాది డిసెంబరు నుంచి కార్యకలాపాలు నిలిపివేసినట్లు బాధితులు వాపోతున్నారు. పెట్టుబడులు పెట్టిన వారంతా తమ డబ్బు ఇప్పించాలని అడుగుతున్న సమయంలోనే రవి, టంగటూరు శివారులో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టాడు.
తమకు డబ్బు ఇవ్వకుండా వ్యాపారం మొదలుపెట్టడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే రవిపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. మల్టీ మార్కెటింగ్ విధానంలో పెట్టుబడులకు లాభాలు ఇస్తామని డబ్బు వసూలు చేశారని, కోట్లలో వసూలు చేసి సొమ్ము ఇవ్వకుండా మోసం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జీఎస్‌ఎన్ సంస్థ బాధితులు శంకర్‌పల్లి మండలంలో వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురి చావుకు కారణమైన జీఎస్‌ఎన్ సంస్థపై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు.
'జీఎస్‌ఎన్ సంస్థ మనీ సర్క్యులేషన్లో జాయిన్ అయి, కొంత మందిని కూడా ఆ సంస్థలో జాయిన్ చేసి ఆదాయం ఆర్జించారు. తర్వాత మనీ సర్క్యులేషన్ బ్రేక్ అయి అప్పులపాలై, అందరికీ డబ్బులు ఇవ్వలేని క్రమంలో ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి భార్య వివరించారు.' - వెంకట్ రమణా గౌడ్, నార్సింగ్ ఏసీపీ.
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య
సూర్యాపేట గురుకులానికి చెందిన మరో విద్యార్థిని సూసైడ్ - అసలేం జరుగుతోందంటూ ఎమ్మెల్సీ కవిత ఆవేదన