Man Got Three Govt Jobs At A Time In Nalgonda : కుటుంబాన్ని నెట్టుకు రావడంకోసం ఎండనకా, వాననకా కూలీనాలీ చేస్తున్న తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశాడీ యువకుడు. కుటుంబాన్ని అర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని గట్టిగా అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగమే కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుతుందనే నమ్మకంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఫలితంగా ఒకేసారి 3 ప్రభుత్వ కొలువులు తెచ్చుకుని కుటుంబంలోని వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు.
పేదింటిలో వికసించిన విద్యాకుసుమం
నల్గొండ జిల్లా తుమ్మలపల్లికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించాడు బత్తుల వినోద్. తనకు ఇద్దరు తోబుట్టువులు. తల్లిదండ్రులు మల్లేశ్. యాదమ్మలు కూలీనాలీ చేస్తు పిల్లల్ని చదివించారు. గుండె సంబంధిత వ్యాధితో వినోద్ తండ్రి మరణించడంతో కుటుంబం అయోమయంలోకి పడింది. దాంతో కుటుంబ పోషణంతా వినోదే చూసుకోవాల్సి వచ్చింది. తండ్రి మరణించినా స్థైర్యం కోల్పోలేదు వినోద్. కుటుంబ భారం మోస్తూనే ఇద్దరి అక్కల వివాహం చేశాడు. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కూలీ పనులు చేస్తూనే టీటీసీ, డీఎస్సీ కోచింగ్ తీసుకున్నాడు. ఓపెన్ డిగ్రీ పూర్తి చేశాడు. 2018 లో వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో నల్గొండ జిల్లాకి ఎస్జీటీ పోస్టులు లేకపోవడంతో జాబ్ చేజారిందని చెబుతున్నాడు.
Battula Vinodh Inspirational Story : మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్(Job Notification) వస్తుందన్న సమయంలో అద్దె గదిలో ఉండి చదువుకున్నానని అంటున్నాడు వినోద్. జిల్లా కేంద్రంలోని లైబ్రరీలోనే రోజంతా గడిచేదని చెబుతున్నాడు. అదే సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించిన సెట్ పరీక్షకు అర్హత సాధించానని వివరిస్తున్నాడు. సమస్యలు వెంటాడుతున్నా పార్ట్ టైం జాజ్(Part Time Job) చేస్తూనే బి.ఎడ్ పూర్తి చేశాడు వినోద్. తర్వాత అంబేడ్కర్ యూనివర్శిటీలో ఎంఏ చేశాడు. అహర్నిశలు కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి చదివాడు. ఫలితంగా ఇటీవలే గురుకుల ఉద్యోగాల్లో జేఎల్, టీజీటీ, పీజీటీ కొలువులను సాధించాడు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో సైకిల్ పైనే కళాశాలకు వెళ్లే వాడినని చెబుతున్నాడు వినోద్.
"కోచింగ్‌కు వెళ్లేందుకు నా వద్ద డబ్బు లేనప్పటికీ కష్టపడి పనిచేసి కోచింగ్‌కు డబ్బులు చెల్లించేవాడిని. దీంతో పాటు నా తల్లిదండ్రులు కూడా సహకారం అందించారు. జేఎల్ స్థాయిలో ప్రిపేర్ అవ్వడం వల్ల ఒకేసారి జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలను పొందడం ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు పడిన కష్టానికి ఫలితం లభించిందని భావిస్తున్నాను"- బత్తుల వినోద్, మూడు ఉద్యోగాలు సాధించిన యువకుడు
ఆ ఆశయంతోనే
చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యంతో 8 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు వినోద్. ఎన్ని సమస్యలోచ్చినా చివరాఖరికి గమ్యాన్ని చేరుకున్నాడు. జూనియర్ లెక్చరర్‌గా(Junior Lecturer) విద్యార్థులకు పాఠాలు బోధిస్తానని చెబుతున్నాడు. వినోద్‌కి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం వినోద్ ఎంతో శ్రమించాడని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా అనుకోని సమస్యలు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం మరవ లేదు వినోద్. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.
ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడు
ఓయూ దిద్దిన వాచ్‌మెన్ కథ ఇది - కోచింగ్ లేకుండానే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం
ఇన్నాళ్లకు కల నెరవేరింది - కుటుంబ ఆలనా - పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి -