Man Got Three Government Jobs in Nalgonda District : ప్రభుత్వ ఉద్యోగం సాధించి, కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని సంకల్పించాడు ఈ యువకుడు. అందుకు నిర్విరామంగా శ్రమించాడు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పుస్తకాలతో యుద్ధం చేశాడు. ఫలితంగా ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. నల్గొండ జిల్లా దోమలపల్లి గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు గడ్డం లింగస్వామి. తల్లిదండ్రులు నర్సింహా, నర్సమ్మలు కులవృత్తితో పాటు వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. దురదృష్టవశాత్తు ట్రాక్టర్ ప్రమాదంలో లింగస్వామి తండ్రి గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. దాంతో ఇళ్లు గడవడం కష్టంగా మారింది.
ఎంఏ తెలుగులో బంగారు పతకం : ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా కుటుంబ భారాన్ని సోదరుడితో కలిసి భుజాన వేసుకున్నాడు లింగస్వామి. ఇందుకు ఓ వైపు ఉన్నత విద్యను అభ్యసిస్తూనే మరోవైపు పొలం పనులకు చూసుకునేవాడు. ఈ క్రమంలో వేకువజామునే లేచి ఊళ్లో పాలు అమ్మేవాడు. అనంతరం ఇళ్లిళ్లూ తిరిగి పేపర్ వేసేవాడు. ఆ పనులన్నీ పూర్తి చేసుకొని కళాశాలకు వెళ్లేవాడినని చెబుతున్నాడు లింగస్వామి. ఆర్థికంగా కుటుంబ పరంగా ఎన్ని సమస్యలొచ్చినా ఏనాడు చదువును వదల్లేదు లింగస్వామి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు టాపర్‌గా నిలిచి, బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీ(B.ED) పూర్తి చేశాడు.
Youth Effort in Govt Job : దాంతో పాటు జాతీయస్థాయిలో నెట్(NET), రాష్ట్ర స్థాయిలో సెట్(SET)లోనూ అర్హత సాధించాడు. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో టీజీటీ (TGT), పీజీటీ, జేఎల్(JL) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు ఈ విజేత. కుటుంబ ఆర్థిక పరిస్థితులను మార్చాలంటే ప్రభుత్వ ఉద్యోగమే మేలని అనుకున్నాడు లింగస్వామి. అలా ఓ వైపు పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోవైపు విద్యార్థులకు ట్యూషన్ చెప్పగా వచ్చే డబ్బులను కుటుంబపోషణకు ఉపయోగించేవాడు. అలాగే చిన్నప్పటి నుంచి కవితలు, సాహిత్యాలు రాయడం అంటే లింగస్వామికి ఇష్టం. దాంతో విశ్వవిద్యాయాల్లోని స్థితిగతులను చూసి కామన్ మ్యాన్(COMMON MAN) అనే పుస్తకాన్ని రచిస్తున్నట్లు చెబుతున్నాడు.
సివిల్ సర్వీసెస్ సాధించమే లక్ష్యం : కుమారుడు లింగస్వామి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడని వారు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే యువత ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని చెబుతున్నాడు లింగస్వామి. ఒకటి, రెండు ప్రయత్నాలను నిరాశ చెందవద్దని సూచిస్తున్నాడు. కాస్త ఆలస్యమైనా పట్టుదలతో చదవితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని అంటున్నాడు. సివిల్ సర్వీసెస్ సాధించమే తన అంతిమ లక్ష్యమని, భవిష్యత్‌లో సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు లింగస్వామి.
'ఒకవైపు వ్యవసాయం చూసుకుంటూ చదువుకున్నా. ఉద్యోగం సాధించాలని ఏకాగ్రతతో చదివా. ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా చూసుకున్నా. అలా నిరంతరం చదివి ఉద్యోగం సాధించా.'- గడ్డం లింగస్వామి, 3 ప్రభుత్వ ఉద్యోగాల విజేత
పేదరికం నేర్పిన పాఠం - వ్యవసాయం కూలీ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రపీఠం
అయినవాళ్లు లేకున్నా అనుకున్నది సాధించాడు - 10 ఏళ్లు కష్టపడి 4 సర్కార్ కొలువులు కొట్టేశాడు