Man Ends Life After Taking Online Loans And Unable to Repay : ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అప్పులు చేసి తీర్చలేక చాలామంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఓ యువకుడు ఆన్లైన్లో గేమ్స్ ఆడి అప్పులు చేస్తే, విషయం తెలుసుకున్న నాన్న ఆ అప్పులన్నీ తీర్చేశాడు. తీరు మార్చుకోవాలని, మళ్లీ గేమ్స్ వైపు చూడొద్దంటూ మందలించాడు. వాటి వల్ల జరిగే అనర్థాల గురించి వివరించాడు. కుమారుడు మాత్రం మళ్లీ అదే వ్యసనంలో పడి అందినకాడికి అప్పులు చేశాడు. ఈసారి తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో చోటుచేసుకుంది.
నారాయణపేట జిల్లా ముక్తిపాడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ వ్యవసాయంతో పాటు సొంతంగా ట్రాక్టర్ కొని డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. గతంలో ఆన్లైన్ గేమ్‌లు ఆడి పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. వాటిని తండ్రి చెల్లించారు. ఇంకెప్పుడూ వాటి జోలికి వెళ్లొద్దని, వాటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని హితవు పలికారు.
అలవాటు మార్చుకోలేక : కొన్నిరోజులు బుద్ధిగా ఉన్న అనిల్, మళ్లీ ఆన్లైన్ రుణాలు తీసుకుని గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. దీంతో ఖాతాలో పంట డబ్బులు, ఇతర నగదు ఏం పడినా అవి వెంటనే రుణం ఇచ్చిన సంస్థలు రికవరీ చేసేవి. ఇలా దాదాపు రూ.10 లక్షల వరకు పోగొట్టాడు. దీంతో తండ్రికి ఏం చెప్పాలో తెలియక శనివారం తన పొలంలోనే గడ్డి మందు తాగాడు. అతన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనిల్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
వినాయకుడి చూసొస్తానని అనంత లోకాలకు : నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయిన పన్నెండేళ్ల కుమారుడు విగతజీవిగా కనిపించిన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన కచ్చు రాకేశ్ గ్రామంలో బుధవారం వినాయక విగ్రహాలను చూడడానికి వెళ్లాడు. చీకటి పడుతున్నా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి భాను పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల, ముఖంపై గాయాలు : కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలించారు. రాకేశ్ కోసం గాలిస్తున్న గ్రామస్థులకు బాల్కొండ ఖిల్లాలో శనివారం మృత దేహం లభించింది. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేవని, తల, ముఖంపై గాయాలున్నాయని ఆర్మూర్ అదనపు డీసీపీ బస్వారెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి ఇన్వేస్టిగేషన్ చేస్తున్నట్లు చెప్పారు. రాకేశ్‌ను హత్య చేసిన వారిని తమకు అప్పగించాలని మృతుడి బంధువులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. నిందితులను శిక్షిస్తామని పోలీసులు వారిని సముదాయించడంతో ధర్నాను విరమించారు.
ఆన్లైన్ గేమ్ ఆడి లక్షల్లో అప్పులు - కారణం తండ్రే అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్