Man Buys Pesticide For Girlfriend To Commit Suicide : ప్రేమించానని మాయ మాటలు చెప్పాడు. నువ్వు లేకపోతే నేనుండలేనంటూ నమ్మబలికాడు. దాదాపు ఏడేళ్లు ఆ అమ్మాయితో కలిసి తిరిగాడు. చనువు పెంచుకున్నాడు. పెళ్లి మాట ఎత్తిన ప్రతిసారి లైఫ్ కాస్త ఎంజాయ్ చేద్దామంటూ మాట దాటేస్తూ వచ్చాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు.
ఇదేంటని నిలదీస్తే సమాధానం లేదు. నన్నే మోసం చేస్తావా అంటూ గళ్లాపట్టి అడిగే సరికి చస్తే చావు, నా పెళ్లికి మాత్రం అడ్డురాకంటూ తన అసలు రూపం బయటపెట్టాడు. అంతటితో ఆగకుండా చావమని పురుగుల మందు కూడా కొనిచ్చాడు. అందుకోసం ఆన్లైన్లో డబ్బు కూడా చెల్లించాడు. చివరకు ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
పరిచయం ప్రేమగా మారి : వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లి ఇసుకపల్లికి చెందిన ములికి ఉమా మహేశ్వరరావుకు కాకినాడ గొడారి గుంటకు చెందిన యువతి(24)తో పరిచయం ఏర్పడింది. 2017లో ఏర్పడిన ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. ప్రేమిస్తున్నానని చెప్పగానే ఆ యువతి నమ్మి అతడి మాయలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఎంతగానో నమ్మింది. అలా ఆమెతో చనువుగా మెలిగి పెళ్లి ప్రస్తావన తీసుకు రాగానే పెద్దలు ఒప్పుకోవడం లేదని బుకాయించడం మొదలు పెట్టాడు.
మరో యువతితో నిశ్చితార్థం : తనతో పెళ్లి గురించి ఆమె నిలదీస్తుండగానే ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు ఉమా మహేశ్వర రావు. ఈ విషయం తెలిసిన అతని ప్రియురాలు ఈ నెల 14వ తేదీన అతన్ని నిలదీసింది. తనను ఎందుకు మోసం చేశావంటూ నిలదీస్తూనే బాధపడింది. నువ్వు లేకపోతే నేను బతకలేనంటూ, పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. కానీ ఆ యువకుడు చస్తే చావు, నా పెళ్లికి అడ్డురాకు అంటూ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు.
ప్రియురాలికి పురుగుల మందు కొనిచ్చి : ప్రేమలో మోసపోయిన బాధలో ఉన్న ఆ యువతి అతడి మాటలు కరెక్టేనని భావించి ఆత్మహత్య చేసుకోవడానికి పురుగులమందు కొనేందుకు దుకాణానికి వెళ్లింది. అప్పటికే ఆమె అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్న ఉమామహేశ్వరావు ఆన్‌లైన్ ద్వారా ఆ పురుగుల మందుకు దుకాణ యజమానికి నగదు కూడా చెల్లించి ప్రియురాలికి పురుగుమందు కొనిచ్చాడు.
ఆత్మహత్యకు పాల్పడిన యువతి : ప్రేమలో విఫలమైన బాధ ఓవైపు, ప్రియుడే చావమన్నాడన్న బాధ ఇంకోవైపు, ఇలా తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉమా మహేశ్వరరావును మంగళవారం రోజున అరెస్టు చేశారు. అనంతరం కోర్డులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని సీఐ పెద్దిరాజు తెలిపారు.