Group 1 Exam Staff Drink Alcohol And Came To Duty At Karimnagar : రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు తప్ప ఎలాంటి అవరోధాలు చోటుచేసుకోలేదు. కానీ కరీంనగర్‌లోని తిమ్మాపూర్ గ్రూప్-1 పరీక్ష కేంద్రంలో మాత్రం ఓ ఉద్యోగి మద్యం తాగి వచ్చి విధులకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తూ మద్యం మత్తులో తోటి సిబ్బంది, పరీక్ష రాసే అభ్యర్థులతో దురుసుగా ప్రవర్తించాడు. గమనించిన పోలీసులు మద్యం తాగాడని నిర్ధారించి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్న అన్వర్ మీర్జా పర్వేజ్ బేగ్‌కు గ్రూప్-1 పరీక్ష విధుల నిర్వహణ డ్యూటీ పడింది. తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన గ్రూప్-1 పరీక్షలో విధులు నిర్వహించాల్సి ఉంది. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి పరీక్షా హాలులోకి పంపించడం అతని విధి. అయితే అతను తోటి సిబ్బంది, అభ్యర్థులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అక్కడే ఉన్న ఎల్ఎండీ పోలీసులు గమనించారు.
వెంటనే అన్వర్ మీర్జా పర్వేజ్ బేగ్ మద్యం తాగాడని నిర్ధారించి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతని బంధువులకు సమాచారం అందించడంతో వారు అక్కడి చేరుకుని పర్వేజ్‌ను ఇంటికి తీసుకెళ్లారు. అయితే అన్వర్ ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కి సస్పెండ్ అయ్యాడు. మళ్లీ తిరిగి విధుల్లోకి చేరిన తర్వాత ఇప్పుడు ఇలా మద్యం తాగి గ్రూప్ -1 పరీక్ష విధుల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
TGPSC Group 1 Prelims Exam Completed : మరోవైపు ఆదివారం రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 74 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన త్వరలోనే ప్రాథమిక కీను విడుదల చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. అక్టోబరు 21న ప్రధాన పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి 563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1ను టీజీపీఎస్సీ నిర్వహించింది. ఉదయం 10 గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు 3 నుంచి 5 కేంద్రాలకు ఓ ఫ్లయింగ్ స్క్వాడ్‌ను బృందం ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను ఏర్పాటు చేశారు.