Person Threatened Police Saying He Is Terrorist : వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించకపోయినా, రాంగ్ రూట్‌లో వెళ్లినా చలాన్‌లు పడతాయని అందరికీ తెలిసిన విషయమే. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడితే, రూల్స్‌కు విరుద్ధంగా ఎవరు వాహనాలు నడిపినా వారిని పట్టుకుని చలానా విధించి, అవసరమైతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటుంటారు. దీనికి ప్రజలు తాము కూడా ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వెళ్లామనో, ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్లు చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కొన్ని సందర్భాల్లో ఏదైనా అత్యవసర పని మీద వెళ్తూ, తప్పనిసరై రాంగ్రూట్లో వెళ్తుంటే తమ తప్పును ఒప్పుకుని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తారు. ఇదంతా రోజూ ఎక్కడో చోట జరిగే తతంగమే. కానీ ఒకతను తప్పు చేసిందే కాకుండా, ట్రాఫిక్ పోలీసులపైకి దౌర్జన్యంగా తిరగబడి, బూతులు తిడుతూ వారిపైకే బైక్‌ను తోసేసాడు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,
అడిగితే కోపమా : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అటువైపుగా వచ్చిన ఓ వ్యక్తి రాంగ్ రూట్‌లో రావడమే కాకుండా, హెల్మెట్ కూడా ధరించలేదు. వారిని గుర్తించిన పోలీసులు ఆ బండిని ఆపారు. అతని వాహనంపై 8 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. 'హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్‌లో రావడం తప్పు కదా' అని అడిగారు. అతని బైక్ కీస్ తీసుకుని ఆపేశారు. దీంతో కోపోద్రిక్తుడైన అతను, పోలీసుల ముందు ఇష్టారీతిన మాట్లాడారు. బూతులు తిట్టాడు.
నేను టెర్రిరిస్ట్‌ను : 'రాంగ్ రూట్‌లో వస్తే చలాన్ రాసి పంపించు. కానీ బండి తాళం ఇవ్వు' అంటూ పోలీసులను బెదిరించాడు. పోలీసులు తాళం ఇవ్వకపోవడంతో 'నేను నక్సలైట్‌ను, టెర్రరిస్టును అంటూ' ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయాడు. మీరు తాళం ఇవ్వరు కదా అంటూ బైక్‌ను తోసేయగా అది కాస్త పోలీస్ కాళ్లపై పడింది. దీంతో అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనిపై కేసు నమోదు చేశారు.