Accused of Theft Committed Suicide While Police Came to Arrest Him : దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేసేందుకు రావడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఏలూరు జిల్లా పోలీసులు మృతుడి భార్యతో రాజీకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో విజయవాడకు చెందిన సూర్యప్రభాస్ (20) ఇళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌కు పాల్పడేవాడు. దీంతోపాటు అతనిపై పోక్సో కేసు నమోదైంది. దొంగతనాలకు సంబంధించి మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. నెల రోజుల కిందట అక్కడ నుంచి పారిపోయి వచ్చి తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురంలోని రాజేశ్వరి కాలనీలో ఓ ఇంట్లో భార్య హారిక, కుమారుడితో అద్దెకు ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు ఎస్సై రామకృష్ణ, ఏఎస్సైతోపాటు మొత్తం ఐదుగురు నిందితుడిని పట్టుకునేందుకు తిరుపతి వచ్చారు. ఏదైనా కేసులో ఇతర జిల్లాల నుంచి వచ్చి నిందితులను పట్టుకునే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది.
అయితే స్థానిక తిరుచానూరు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సూర్య ప్రభాస్ రాజేశ్వర కాలనీలో ఉన్నట్లు గుర్తించిన జంగారెడ్డి పోలీసులు నేరుగా అతని ఇంటికి ఉదయం 6 గంటల సమయంలో వెళ్లారు. పోలీసుల రాకను గుర్తించిన నిందితుడు సూర్యప్రభాస్ ఇంట్లో గడియ పెట్టుకుని పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానని బెదిరించారు. ఆ తర్వాత అతను స్నానాల గదిలోకి వెళ్లి నిప్పు అంటించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తలుపులు పగులగొట్టి అతన్ని రుయా ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో అతని భార్య హారిక, కుమారుడు ఉన్నారు.
మామూలు ప్లాన్ కాదు - బంగారం దోపిడీకి ఏం చేశాడంటే !
హుటాహుటిన విమానంలో వచ్చి రాజీ : పోలీసులను చూసి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగులోకి వస్తే తీవ్ర సంచలనంగా మారడంతోపాటు తమ ఉద్యోగానికి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో పోలీసులు రాజీకి యత్నించారన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి డివిజన్ స్థాయి అధికారి ఒకరు హుటాహుటిన విమానంలో తిరుపతి చేరుకుని రూ.5 లక్షలకు రాజీ చేసినట్లు సమాచారం.
విషయాన్ని బయటకు వెల్లడించకుండా మృతుడి భార్యపైనా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశంలో తన భర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్యతో పోలీసులు స్టేట్‌మెంటు తీసుకుని కేసు నమోదు చేశారు. మరోవైపు రుయాలో మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించి గోవిందధామంలో సాయంత్రానికే దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.