Maha Shivratri Celebrations Telangana 2024 : మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. హైదరాబాద్‌లోని కీసర గుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి(Maha Shivratri 2024) వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.
Maha Shivratri in Vemulawada : వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ(Vemulawada Temple), విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతోంది. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత దేవస్థానంలో వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించిన అర్చకులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమదేవరపల్లి మండలం వంగర, ముత్తారం గ్రామాల్లోని శివాలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సహా అన్ని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Maha Shivratri in Telangana : పర్వదినం వేళ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఆలయానికి, తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అతి పురాతన ఆలయాలైన కదిలిపాహరేశ్వర, బూర్గుపెల్లి శివాలయాల్లో భక్తులు బారులుదీరారు.
సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా మంథనిలోని గోదావరి నదిలో శివరాత్రి సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ సిద్దులగుట్ట, బోధన్ చక్రేశ్వర ఆలయం, లోంక రామలింగేశ్వర ఆలయం, కామారెడ్డిలోని మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి? మీకు తెలుసా?
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం దుబ్బరాజన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నీలకంఠుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయం, భక్తులతో కిటకిటాలాడుతోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శ్రీ మీనాక్షి సమేత ఆగస్త్యేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణా నదిలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.