Macherla MLA Pinnelli Ramakrishna Reddy EVM Destroy Video : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు.
ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న విపక్షపార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఉదుటున దూసుకెళ్లి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిపై దాడి చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణుల వల్లే విధ్వంసం : ఎన్నికల ముందు నుంచీ మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేట్లు, ఏకంగా ఎమ్మెల్యేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి దౌర్జన్యం చేయడం చూస్తే అక్కడ పోలింగ్ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణుల వల్లే విధ్వంసం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదిలావుంటే ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు పల్నాడు జిల్లా వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. దాడులకు పాల్పడిన పిన్నెల్లి, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే హైదరాబాద్ వెళ్లారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. దీనికి పిన్నెల్లి సోదరులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.