MAA Association Lifted the Ban on Actress Hema : ప్రముఖ సినీనటి హేమపై విధించిన సస్పెన్షన్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తేసింది. ఈ మేరకు ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు మా అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రతిపాదనతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవ ఆమోదంతో హేమపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. బెంగళూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణలు రావడంతో కొంతకాలం హేమపై మా అసోసియేషన్ సస్పెన్షన్ విధించింది.
ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించిన సభ్యులు హేమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. దీంతో ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంలో మీడియాలో ఎక్కడా మాట్లాడకూడదని, ఇందుకు సంబంధించిన విషయాలను ప్రస్తావించకూడదని మా అసోసియేషన్ హేమకు సూచించింది.
ఇది అసలు కథ : మూడు నెలల క్రితం జరిగిన కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో ఓ రేవ్ పార్టీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పార్టీలో సినీ నటి హేమ పోలీసులకు పట్టుబడిన విషయం కూడా విదితమే. ఆ పార్టీకి ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. వారిలో సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ రేవ్ పార్టీలో 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 103 మందిలో 86 మందికి డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో నటి హేమ ఉన్నారని అప్పట్లో పుకార్లు వచ్చాయి.
బహిరంగ పరీక్షలకు సిద్ధం : ఈ రేవ్ పార్టీపై స్పందిస్తూ మొదట్లో నటి హేమ డ్రగ్స్‌లో తాను దొరికానన్న వార్తలు అవాస్తవమని ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆమె హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో చిల్ అవుతున్నట్లు ఉంది. అయితే డ్రగ్స్ రేవ్ పార్టీపై మీడియా సమావేశం నిర్వహించిన బెంగళూరు నగర పోలీసు కమిషనర్ నటి హేమ పాల్గొన్నారని స్పష్టం చేశారు. మళ్లీ ఈ మధ్య వీటన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ మరో వీడియోను విడుదల చేశారు. రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో అన్ని పరీక్షలు చేయించుకున్నానని అన్నిట్లో నెగిటివ్ వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని టీవీ ఛానళ్లకు వివరించానని తెలిపారు.
అవసరం అయితే తాను బహిరంగంగా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమని అన్నారు. ఇప్పటికైనా అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని కోరారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవాలనుకుంటున్నానని, అపాయింట్ కావాలని అడుగుతున్నానని అన్నారు. గత 35 సంవత్సరాలుగా సంపాదించుకున్న పరువు మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మా అసోసియేషన్ కీలక నిర్ణయం - సినీ నటి హేమ సస్పెండ్! - Maa Association Suspend Hema